మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి
షాబాద్: అభం శుభం తెలియని పిల్లలు, వృద్ధులను కిరాతకంగా హతమార్చడం దుర్మార్గమైన, హేయమైన చర్యగా మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి అభివర్ణించారు. మండల కేంద్రంలోని బాధితుల ఇంటి వద్ద ఆదివారం మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబంలోని మేఘనకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పటికే రూ.5లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు అంశం కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, నాయకులు తమ్మలి రవీందర్, రాజేందర్‌గౌడ్, రామస్వామి, మాణిక్‌రెడ్డి, అస్మత్‌పాషా, ఉపసర్పంచ్ దండు రాహుల్‌గుప్తా ఉన్నారు.
దుర్మార్గుడిని వదిలిపెట్టొద్దు
యావత్ తెలంగాణను చలింపజేసిన హత్యోదంతం అత్యంత దారుణమని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. కాయ కష్టం చేసుకుని బతికే కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని అన్నారు. ఇలాంటి క్రూర మృగాన్ని కేసు పెట్టినా పట్టుకోకుండా పోలీసులు తప్పు చేశారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


