తాత్కాలికంగా అప్పగించాం
● ఒకే ఏజెన్సీకి ఎనిమిది ఆస్పత్రుల బాధ్యతలు
● నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని ఆరోపణలు
తాండూరు: వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు నిర్వహిస్తున్న కాంట్రాక్టు భాద్యతలు నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీలకు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పరిగి, కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య పనులకు కాంట్రాక్టు నిర్వహిస్తున్న వినాయక ఏజెన్సీని రద్దు చేసి మరో ఏజెన్సీకి కట్టబెట్టడం వెనుక రాజకీయ ఒత్తిడిలే కారణమనే ప్రచారం సాగుతోంది. టెండర్ పత్రంలోని నిబంధనలను పక్కన పెట్టి అధికార యంత్రాంగం కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ డాక్యుమెంట్‌లోని క్లాజ్ 8.3.4 ప్రకారం ఏదైన సంస్థ ఐదు కంటే ఎక్కువ ఆస్పత్రులు లేదా సంస్థలకు మాత్రమే కాంట్రాక్టు నిర్వహించాలి. ఒకవేళ ఎల్–1(లోయెస్ట్ బిడ్డర్–1) అయినప్పటికీ ఐదు ఆస్పత్రులకు మాత్రమే కాంట్రాక్టు చేపట్టే అవకాశం ఉంటుందని స్పష్టం పేర్కొన్నారు. అంతుకు మించి ఒప్పందాలు చేసుకున్నట్లు తేలితే సంబంధిత ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చవచ్చు అని ముందుగానే సంతకాలు తీసుకుంటారు.
కాంట్రాక్ట్ రద్దు
జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధీనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, క్లస్టర్ హెల్త్ సెంటర్‌లు కొనసాగుతున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో శానిటేషన్ పనులకు సంబంధించి గతంలో అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిన టెండర్‌లు పిలిచి బాధ్యతలు అప్పగించారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, పరిగి, కొడంగల్ ఆస్పత్రుల్లో వినాయక ఏజెన్సీ పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తోంది. ఈ ఏజెన్సీ నిర్వాహకుడిపై రాజకీయ వివాదాలతో పాటు నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండు రోజుల క్రితం మూడు ఆస్పత్రులకు ఉన్న శానిటేషన్ కాంట్రాక్ట్‌ను జిల్లా అఽధికారులు రద్దు చేశారు. అనంతరం ఈ ఆస్పత్రులకు జీఎంఆర్ ఏజెన్సీకి శానిటేషన్ పనుల బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఏజెన్సీ తాండూరు ఎంసీహెచ్ మర్పల్లి ఆస్పత్రి, మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి, వనపర్తి, కల్వకుర్తి ఆస్పత్రుల శానిటేషన్ కాంట్రాక్టులను నిర్వహిస్తోంది. టెండర్‌లోని నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు జిల్లాలోని మూడు ఆస్పత్రుల బాధ్యతలు అప్పగించడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వివాదాలే కారణమా?
తాండూరుకు చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్‌నాయక్ కొన్నేళ్లుగా వినాయక ఏజెన్సీ పేరిట ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ పనులు చేస్తూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు వరకు విఠల్‌నాయక్ కాంగ్రెస్‌లో కొనసాగుతూ వచ్చాడు. ఈ క్రమంలో తన అల్లుడిని కౌన్సిలర్‌గా పోటీ చేయించేందుకు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కలిసి టికెట్ అడిగారు. డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ సోదరుడు రామునాయక్‌కు అవకాశం కల్పించారు. దీంతో టికెట్ ఆశించి భంగపడిన విఠల్‌నాయక్ కాంగ్రెస్‌ను వీడి గులాబీ పార్టీలో చేరి అల్లుడు సురేశ్‌నాయక్‌ను బరిలో నిలిపాడు. ఈ ఎన్నికల్లో విఠల్‌నాయక్ అల్లుడు విజయం సాధించాడు. దీంతో నాటి నుంచి ఇరు వర్గాల మధ్య రాజకీయ దుమారం నెలకొంది. విఠల్‌నాయక్ జిల్లాలోని ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న కాంట్రాక్టు రద్దుకు ఇదే ప్రధాన కారణమంటూ స్థానికంగా చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి
జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య కాంట్రాక్టులు నిర్వహిస్తున్న వినాయక ఏజెన్సీపై పలు ఫిర్యాదులు అందాయి. నిబంధనల ప్రకారం నోటీసులు, మెమోలు జారీ చేశాం. అయినా తీరు మారకపోవడంతో ఏజెన్సీని రద్దు చేశాం. పారిశుద్ధ్య పనులు నిలిచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో తాత్కాలికంగా జి.మల్లారెడ్డి ఏజెన్సీకి భాద్యతలు అప్పగించాం. రెండు నెలల వ్యవధిలో పారిశుద్ధ్య పనుల కోసం కొత్తగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తాం.
– డాక్టర్ ఆనంద్, డీసీహెచ్‌ఎస్, వికారాబాద్


