
ముగ్గురి బైండోవర్
మోమిన్‌పేట: మండల తహసీల్దార్ కార్యాలయంలో ముగ్గురిని బైండోవర్ చేసినట్లు బుధవారం తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి తెలిపారు. గతంలో సారా కాస్తున్న లచ్చానాయక్ తండాకు చెందిన మేఘవత్ ప్రభు, మేఘవత్ బుజ్జిబాయి, మేఘవత్ ఫకీరలను బైండోవర్ చేశామన్నారు. ఎలాంటి ప్రభుత్వ నిషేధిత వస్తువుల జోలికి వెళ్లకూడదని ఆయన సూచించారు.
వాగులో
ఇరుక్కుని జింక మృతి
ధారూరు: మండే ఎండలకు దాహార్తికి గురైన చుక్కల జింక వాగులోకి వెళ్లి నీటమునిగి మృతి చెందింది. ఈ మేరకు కళేబరాన్ని బుధవారం ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ధారూరు ఫారెస్టు రేంజర్ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గట్టెపల్లి–అల్లాపూర్ గ్రామాల మధ్య ఉన్న వాగులో నీటిని తాగేందుకు చుక్కల జింక దిగింది. లోతు ఎక్కువ ఉండటం, బురద నేల కావడంతో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక మృతి చెందింది. నాలుగు రోజుల తర్వాత జింక కళేబరం నీటిపై తేలడంతో, చేపలు పట్టేందుకు వెళ్లిన పెద్దేముల్ మండలం మారెపల్లితండాకు చెందిన వార్త్య శ్రీనివాస్‌కు కన్పించింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా రేంజర్ రాజేందర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి జింక కళేబరాన్ని బయటకు తీయించారు. కుళ్లిపోయి ఉండటంతో 4 రోజుల క్రితం మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. జింక కళేబరాన్ని పోస్టుమార్టం చేయించి పక్కనే పూడ్చి పెట్టినట్లు రేంజర్ తెలిపారు.