‘పాలమూరు – రంగారెడ్డి’పై సర్కారు నిర్లక్ష్యం
● పది శాతం పనులు కూడా చేయలేదు
● మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి
మీర్‌పేట: రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై బుధవారం మీర్‌పేటలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చెప్పిన వాస్తవాలను పక్కనపెట్టి కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 90 శాతం పనులు పూర్తయినా మిగతా 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో చెప్పాలన్నారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడంతో పాటు ప్రాజెక్టుపై శీతకన్ను వేశారన్నారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సాగు నీరందించాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం, పాలమూరు వంటి రెండు పెద్ద ప్రాజెక్టులను నాడు కేసీఆర్ ప్రారంభించారన్నారు.
45 టీఎంసీలు ఎలా సరిపోతాయి?
కేసులు కొట్టేసిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.30వేల కోట్లతో పాలమూరు పనులకు శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. అంతేకాక రూ.27వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు కూడా పూర్తయ్యాయని, ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కేటాయించకపోగా, తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. 45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారని, అలాంటి గొప్ప నేతను విమర్శించడం మాని, మిగిలిన పనులను ప్రభుత్వం పూర్తి చేయాలని ఎద్దేవా చేశారు. ఈ అంశంపై కేసీఆర్ అధ్యక్షతన తమ కార్యాచరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, హరీశ్వర్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


