కేసుల ఛేదనలో పురోగతి
వికారాబాద్: గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో సైబర్, ఇతర నేరాలు పెరిగాయని, కేసుల నమోదులో పారదర్శకంగా వ్యవహరించామని ఎస్పీ స్నేహమెహ్ర తెలిపారు. 2024తో పోలిస్తే ప్రధాన నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోందన్నారు. బుధవారం వికారాబాద్‌లోని జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2025లో నమోదైన నేరాలకు సంబంధించి వార్షిక నివేదికను వెల్లడించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, నిఘా వ్యవస్థల బలోపేతం, నిరంతర అవగాహన కార్యక్రమాలతో ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని పేర్కొన్నారు. మృతుల సంఖ్య తగ్గిందన్నారు. గుట్కా క్రయ విక్రయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక దందాను సమర్థవంతంగా కట్టడి చేసినట్లు వివరించారు. డయల్ 100కు అత్యధిక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇందులో ఈవ్ టీజింగ్ తదితర కేసులు ఉన్నాయన్నారు. వీటన్నింటిని పరిశీలించి పరిష్కరించామని పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా 1,741 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ కార్యక్రమాల ద్వారా బాలకార్మికులకు విముక్తి కల్పించామన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా కేసుల ఛేదనలో మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములునాయక్, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, వికారాబాద్, పరిగి డీఎస్పీలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ చాటిన సిబ్బందికి అభినందనలు
అనంతగిరి: డిజిటల్ సేవల్లో ప్రతిభ చాటిన జిల్లా ఐటీ సెల్, ఈకాప్స్ పోలీసు అధికారులు రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ అడిషనల్ డీజీపీ వీవీ శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. జిల్లాలో సీసీటీ ఎన్‌ఎస్ (వెర్షన్ 1 – 2) సాఫ్ట్‌వేర్ వినియోగాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, డిజిటల్ సేవలను మరింత చేరువ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచినందుకు వీరికి ఈ రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో జిల్లా ఐటీ హెడ్ కానిస్టేబుల్ కేశవులు, కానిస్టేబుల్ శివశంకర్, పరిగి పోలీస్ స్టేషన్ ఈకాప్స్ కానిస్టేబుల్ బక్కరెడ్డి, యాలాల కానిస్టేబుల్ సందీప్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహమెహ్ర వారిని అభినందించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, అంకితభావంతో విధి నిర్వహణ చేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్, నిఘా వ్యవస్థలను బలోపేతం చేశాం
గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య పెరిగింది
రోడ్డు ప్రమాదాలు తగ్గాయి
ఎస్పీ స్నేహమెహ్ర
జిల్లాలో నమోదైన కేసులపై వార్షిక నివేదిక వెల్లడి


