క్రమశిక్షణ, సమన్వయం ముఖ్యం
అనంతగిరి: విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమన్వ యం ఎంతో ముఖ్యమని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నా రు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పని చేస్తున్న వివిధ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి విభాగం పనితీరును, పెండింగ్‌లో ఫైళ్లను పరిశీలించారు. అనంతరం విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో క్రమశిక్షణ అనేది అత్యంత ప్రధానమైనదని, ప్రతి అధికారి సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కార్యాలయానికి వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విభాగాల మధ్య పరస్పర సమన్వయం ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. సహోద్యోగులందరూ ఒకే కుటుంబంలా కలిసి పనిచేయాలని సూచించారు. మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి పనిని ప్రణాళికాబద్ధంగా విభజించుకోవాలని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, విధుల్లో పారదర్శకతను పెంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బీ రాములు నాయ క్, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, ఏఓ ఖాజా మోహినొద్దీన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


