లెక్కచెప్పాల్సిందే..
75 జీపీలు, 1,252 వార్డులు ఏకగ్రీవం సర్పంచ్ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులు 1,933 మంది వార్డు స్థానానికి 10,055 మంది గెలిచిన వారితో పాటు ఓడినవారూ వెల్లడించాల్సిందే లేకుంటే అనర్హత వేటు ఓడిన వారు చెప్పకుంటే ఆరేళ్లపాటు పోటీకి అనర్హులు 45 రోజుల్లోగా రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలి
వికారాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి.. గెలిచిన వారు ఆనందంలో మునిగిపోయా రు. ఓటమి చవిచూసిన వారు అంతర్మథనం చేసుకుంటున్నారు.. ఎక్కడ లెక్క తప్పిందబ్బా అంటూ లెక్కలేసుకుంటున్నారు. ఓటమికిగల కారణాలను విశ్లేషిస్తున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం ఇక ఎవరితో మాకేంటని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే నామినేషన్ వేసిన నాటినుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు చేశారో వివరాలు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. లేదంటే ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకా రం చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కలను బిల్లులతో సహా ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి 45 రోజుల్లోగా చూపించాల్సిందేనని నిబంధనలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని 594 గ్రామ పంచాయతీలు, 5,058 వార్డులకు ఈ నెలలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. తాండూరు రెవెన్యూ డివిజన్‌లోని 8 మండలాల్లో 11వ తేదీ, వికారాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని 7 మండలాల్లో 14వ తేదీ, పరిగి సెగ్మెంట్‌లోని 5 మండలాల్లో 17వ తేదీ ఎన్నికలు జరిగాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పోలింగ్ తేదీకి పదిహేను రోజుల ముందు నిర్ణీత మండలాల్లో ప్రారంభమైంది. దీని ప్రకారం పోలింగ్ ముగిసిన 45 రోజుల్లోగా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలోని 594 జీపీలకు గాను 75 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యా యి. మిగతా వాటికి 1,933 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు. 5,058 వార్డులు ఉండగా 1,252 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి 10,055 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరందరూ ఎన్నికల ఖర్చులు చెప్పాల్సిందే.
నిబంధనలివే..
పెరుగుతున్న వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అభ్యర్థులు బ్యాంక్ ఖాతా నుంచే వ్యయం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 5 వేల జనాభా పైబడిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి వ్యయ పరిమితిని రూ.2.50 లక్షలు, వార్డుసభ్యులు రూ.50 వేల లోపే ఖర్చుచేయాలి. అదే విధంగా 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు పోటీచేసే సర్పంచ్ అభ్యర్థులు రూ. 1.50లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేల లోపే ఖర్చు చేయాలి. నామినేషన్ వేసిన తేదీ నుంచి పోలింగ్ ప్రక్రియ వరకు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను 45 రోజుల్లోగా సమర్పించాలి. నూతన పంచాయతీరాజ్ చట్టం – 2018 ప్రకారం తాము చేసిన ఎన్నికల వ్యయాన్ని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు గడువులోగా సమర్పించకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గెలిచిన అభ్యర్థులు లెక్కలు చూపకుంటే అనర్హత వేటు కు గురవుతారు. అంతేకాకుండా ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఓడిపోయిన అభ్యర్థులు కూడా లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. చట్టం 237 ప్రకారం ఎన్నికల ఖర్చు వివరాలను అందించాలని అధికారులు కోరుతున్నారు.
వాస్తవ లెక్కలు సమర్పించేనా?
జిల్లాలో 594 పంచాయతీలు, 5,058 వార్డులు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ వ్యయ పరిమితిని విధించింది. అయితే అభ్యర్థులు మాత్రం ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐదు వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50లక్షలు, వార్డు అభ్యర్థులు రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.కోటికి పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. నిఘా పెట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఏ మేరకు ఖర్చుల వివరాలు చూపుతారో చేచి చూడాల్సి ఉంది.


