చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో సెప్టెంబర్ 1 నుంచి నెల రోజుల పాటు పురుషులకు రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్(ఏసీ)లపై ఉచిత రిపేరు, సర్వీసింగ్‌పై ఉచితంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు, పురుషులు అర్హులని తెలిపారు. కనీసం విద్యార్హత 10వ తరగతి చదువుకుని ఉండాలని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ట్రైనీస్‌కి ఉచిత భోజనం కల్పించడంతో పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రువపత్రాలు అందజేస్తామని తెలిపారు. శిక్షణ తీసుకోదలచిన వారు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఏదైనా ఎడ్యుకేషన్ ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. ఫోన్: 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లలో సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
నకిలీ బంగారంతో టోకరా
– రూ.5.24 లక్షలతో పరార్
తిరుపతి క్రైం : నకిలీ బంగారాన్ని మూడు దుకాణాల్లో కుదువబెట్టి నగదుతో పరారైన ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. దాదాపు 60 గ్రాముల నకిలీ బంగారాన్ని కుదువబెట్టి రూ.5.24 లక్షల నగదును కాజేసినట్లు బాధిత వ్యాపారులు తెలిపారు. లక్ష్మీపురం సర్కిల్‌లోని భవాని పాన్ బ్రోకర్, దేవేంద్ర పాన్ బ్రోకర్, అలాగే ఎల్‌ఎస్ నగర్‌లోని శ్రీవినాయక కుదువ దుకాణంలో ఈ మోసం జరిగినట్లు సమాచారం. అంకిత, భాస్కర్‌నాయుడు పేర్లతో ఉన్న ఆధార్ కార్డులను చూపించి కేటుగాళ్లు నగదును పొందినట్లు తెలుస్తోంది. నగలపై ఉన్న హాల్‌మార్క్‌ను నమ్మిన వ్యాపారులు వాటిని కుదువబెట్టుకుని నగదు ఇచ్చారు. అయితే, ఆలస్యంగా బంగారం నాణ్యతను పరీక్షించగా అవి నకిలీవని తేలడంతో కుదువ దుకాణాల యజమానులు ఖంగుతిన్నారు. మోసగాళ్లు అందించిన ఆధార్ కార్డులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై సీసీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధిత వ్యాపారులకు తిరుపతి అడ్మిన్ ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సూచించినట్లు సమాచారం.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 77,085 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,766 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.61 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
సమ్మె తాత్కాలిక విరమణ
తిరుపతి తుడా: స్టైఫండ్ 30 శాతం పెంచాలంటూ రుయా వేదికగా గత 16 రోజులుగా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో హోరెత్తించిన ఎస్వీ వైద్య కళాశాల జూడాలు సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు ప్రకటించారు. రాష్ట్ర జూడా అసోసియేషన్ పిలుపు మేరకు కోర్డు ఆదేశాలను గౌరవిస్తూ పేదరోగుల ఇబ్బందులను గుర్తించి తాత్కాలికంగా వాయిదా వేశామని వెల్లడించారు. ప్రభుత్వం రెండు వారాలోపు తమ న్యాయపరమైన డిమాండ్లను అంగీకరించి స్టైఫండ్‌ను పెంచాలని సూచించారు.
జీవితాలతో చెలగాటమొద్దు
తిరుపతి రూరల్: న్యాయం కోసం బిల్ కలెక్టర్లు చేపట్టిన నిరసన దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన బిల్ కలెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు మంగళవారం దీక్షా శిబిరంలోనే పోరాటం కొనసాగించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి సేవలందించిన కార్మికులను ఒక్కసారి గా తొలగించడం అన్యాయమని మండిపడ్డారు.


