తిరుపతి అర్బన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబునాయుడు కళాకారులను ఆదుకోవాలని కళాకారుల రాష్ట్ర ఇన్‌చార్జి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాఽథ్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రజానా ట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి.మురళి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి నేతృత్వంలో ఆటపాటలతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన కళాకారులకు రూ.10 వేలు పింఛన్ ఇవ్వాలని సూచించారు. జానపద, గ్రామీణ, కోలాట, భజన బృందాల కళాకారులకు నంది నాటకోత్సవాల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని కార్యక్రమాల్లో కళాకారులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా రోస్టర్ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు విశ్వనాథ్, గుర్రప్ప, చారులత, నాగరాజు, నారాయణదాసు, నదియా తదితరులు పాల్గొన్నారు.


