బుచ్చినాయుడుకండ్రిగ: కూలి పనులు చేసుకుని జీవిస్తున్న అతనికి సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ఎప్పటినుంచో ఆశ ఉండేది. ఆ కల తీరేలోపే మృత్యువు కబళించేసింది. కుటుంబ యజమానిని దూరం చేయగా.. తీవ్ర గాయాలతో భార్యను ఆస్పత్రి పాలుచేసింది. ముక్కుపచ్చలారని ఇద్దరు కూతుళ్లను వీధిన పడేసింది. ఈ విషాద ఘటన తలారివెట్టు గ్రామ సమీపంలోని బస్టాండ్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. వరదయ్యపాళెం మండలం, పెద్ద పాండూరు గ్రామం, వేంకటేశ్వర కాలనీ చెందిన కటారి వెంకటేష్ (29), శిరీష భార్యాభర్తలు. వీరికి హర్షిత(6) రజిత(2) కుమార్తెలున్నారు. ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఇల్లుకట్టుకోవాలని తాపత్రయపడేవారు. ఇందులో భాగంగా ఇంటి పని పూర్తికావస్తుండడంతో ఆనందపడ్డారు. టైల్స్ కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంలో శ్రీకాళహస్తికి వెళ్లి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో తలారివెట్టు గ్రామ సమీపంలోని బస్టాండ్ వద్ద వరదయ్యపాళెం నుంచి నెలవాయికి వెళ్తున్న కారు రాంగ్‌రూట్‌లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేంకటేష్, శిరీషాకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. శిరీష పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.
అమ్మా.. నాన్నా!
సాయంత్రం అమ్మానాన్నలను వెతుకుతూ చిన్నారులు గుక్కపట్టి ఎడ్వడం చూపరులను కలచివేసింది. అమ్మా.. నాన్నా.. అంటూ ఎక్కిఎక్కి రోదించడం కన్నీళ్లు తెప్పించింది. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.


