తిరుపతి రూరల్: ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలో సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. శనివారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల 2.07 లక్షల గృహాలపై 415 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 1.06 లక్షల గృహాల్లో 214 మెగావాట్ల మేర ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 39,215 బీసీ గృహాలకు 78.43 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ ద్వారా 1.35 లక్షల పంపు సెట్లకు 610 మెగావాట్ల సౌర విద్యుత్ అందించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం 62 నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టామని, 13.20 లక్షల స్మార్ట్ మీటర్ల లక్ష్యంలో ఇప్పటికే 10.74 లక్షలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు
సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు బెస్ట్ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ తదితర విభాగాల్లో సీఎండీ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
మాధవమాలలో క్రాఫ్ట్
ఉడ్ బ్యాంకు ప్రారంభం
ఏర్పేడు: మండలంలోని మాధవమాలలో శనివారం క్రాఫ్ట్ ఉడ్ బ్యాంకును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రాజమహేంద్రవరం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. మాధవమాలలో ప్రఖ్యాతిగాంచిన కొయ్యబొమ్మల కళాకారులను రాష్ట్ర అటవీ శాఖ సంప్రదాయ శిల్పకళను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇక్కడ క్రాఫ్ట్ ఉడ్ బ్యాంకును కప్రారంభించారు. మాధవమాలలో అటవీశాఖ సీసీఎఫ్ వై.శ్రీనివాసరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. డీఎఫ్‌వోలు వి.సాయిబాబ, బబిత, రామకొండారెడ్డి, రవిశంకర్‌శర్మ, రేంజర్ వి.సుదర్శన్‌రెడ్డి, డీఆర్‌వో శశికుమార్, బీజేపీ నేత కోలా ఆనంద్‌కుమార్, పేరం నాగరాజనాయుడు, చెంచయ్యనాయుడు, సింగిల్‌విండో అధ్యక్షుడు మహేష్‌రెడ్డి, కేకే రమణ పాల్గొన్నారు.


