తిరుపతి మంగళం : నమ్మిన వాళ్లను నట్టేట ముంచి, వంచించడం చంద్రబాబు నైజమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శనివారం మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీకి వెళ్లి టెట్ సమస్యపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసి వినతి పత్రం ఇచ్చిన ముగ్గురు టీచర్లపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో తన కుమారుడు మంత్రి లోకేష్ డీఎస్సీలో పాల్పడిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలపై అంత తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని, దీనికి నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేసేంతవరకు వైఎస్సార్‌సీపీ పోరాటాలు ఆగవని హెచ్చరించారు. టీచర్లను నమ్మించి, ఓట్లు దండుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాళ్లను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీస్తూ వారి జీవితాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు వైఖరి పై ప్రభుత్వ టీచర్లు చేసే పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ లక్ష అరవై వేలమంది పైగా ప్రభుత్వ టీచర్లు ఉంటే అందులో 90 శాతం టీడీపీకి అనుకూలంగా ఓట్లు వేశారన్నారు. అయినా కూడా టీచర్లపై చంద్రబాబు కృతజ్ఞత చూపడకుండా నమ్మించి మోసగించారన్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి చేయాలని నిర్ణయం పునఃసమీక్ష చేయాలని కేంద్ర మంత్రిని కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. టీచర్లకు టెట్ పరీక్ష మినాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వంచించడం.. బాబు నైజం
Aug 17 2026 7:23 AM | Updated on Aug 17 2026 7:23 AM
● డీఎస్సీ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే
టీచర్లపై సస్పెన్షన్ వేటు
● ఉపాధ్యాయుల మనోభావాలతో
ఆటలాడుతున్న కూటమి ప్రభుత్వం
● చంద్రబాబు వైఖరిపై టీచర్లు చేసే
పోరాటానికి వైఎస్సార్‌సీపీ మద్దతు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
భూమన కరుణాకరరెడ్డి
Advertisement


