ఎంపీ మిథున్‌రెడ్డి అయ్యప్ప మాల ధారణ | - | Sakshi
Sakshi News home page

ఎంపీ మిథున్‌రెడ్డి అయ్యప్ప మాల ధారణ

Aug 17 2026 7:23 AM | Updated on Aug 17 2026 7:23 AM

తిరుపతి కల్చరల్‌: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శనివారం అయ్యప్ప మాలధారణ స్వీకరించారు. ఈ మేరకు శ్రీకపిలేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని పుణ్యస్నానం ఆచరించి ఆలయ అర్చకుడిచేత అయ్యప్ప స్వామి వారి దీక్ష మాల స్వీకరించారు. అనంతరం శ్రీకపిలేశ్వరస్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,699 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,884 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

టిప్పర్‌ ఢీ

– వృద్ధుడి మృతి

రామచంద్రాపురం: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొట్టడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం .. తిరుపతి గణపతి నగర్‌కు చెందిన అల్లయ్య (63) వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై తిరుపతి నుంచి పచ్చికాపల్లం వైపు బయలుదేరారు. అదే సమయంలో తిరుపతి–పచ్చికాపల్లం రహదారిలోని కూపుచంద్రపేట గ్రామ సమీపంలో చైతన్య జూనియర్‌ కళాశాల వద్ద అతివేగంగా వచ్చిన టిప్పర్‌ అల్లయ్య ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తులో ఉంది.

లోయలోకి దూసుకెళ్లిన లారీ

– ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్‌ మృతి

చంద్రగిరి: ప్రమాదవశాత్తు లారీ లోయలోకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఘటన శసివారం తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారి, భాకరాపేట కనుమలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన లారీ పీలేరు నుంచి తిరుపతి వైపు బయల్దేరింది. భాకరాపేట కనుమ వద్ద వస్తున్న క్రమంలో పెద్ద మలుపు కాడ వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళి, పల్టీకొట్టుకుంటూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, బస్తీ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవరు రాజేంద్ర(35) తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేంద్ర మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

ముందు సీలు.. వెనుక సేలు!

– స్వాతంత్య్ర దినోత్సవం రోజు

మద్యం అమ్మకాల పరిస్థితి ఇదీ

నాయుడుపేట టౌన్‌: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డ్రైడే పాటిస్తూ ఎకై ్సజ్‌ అధికారులు మద్యం దుకాణాలకు సీళ్లు వేశారు. కానీ జిల్లాలోని అనేక దుకాణాలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగించాయి. దుకాణానికి ముందు వేసిన సీళ్లు వేసినట్టే ఉండగా.. వెనుక దొడ్డిదారిన మద్యం సేల్స్‌ భారీగా సాగింది. ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.50 చొప్పున అధనంగా వసూలు చేశారు. బీర్‌ బాటిల్‌పై రూ.70 నుంచి రూ.80 వరకు అధనంగా వసూలు చేసినట్టు సమాచారం. తిరుపతి, నాయుడుపేట, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement