నేత కార్మికుల కడుపు కొట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

నేత కార్మికుల కడుపు కొట్టొద్దు

Aug 17 2026 7:23 AM | Updated on Aug 17 2026 7:23 AM

నేతన్న సేవలో నిధులు గోల్‌మాల్‌ గత ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికం అర్హులకు న్యాయం చేసే వరకు పోరాడుతాం కూటమి ప్రభుత్వ వైఖరిపై నేదురుమల్లి ధ్వజం

వెంకటగిరి(సైదాపురం): నేత కార్మికుల కడుపు కొట్టొద్దని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వకర్త నేదురమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసం, ఎన్‌జేఆర్‌ భవనంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వెంకటగిరిలో చేనేత కార్మికులకు అందాల్సిన నేతన్న సేవలో నిధులను పక్కదారి పట్టాయని ఆరోపించారు. అర్హత ఉన్నా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు లబ్ధి చేకూర్చకుండా నిధులను టీడీపీ కార్యకర్తల ఖాతాల్లో జమచేశారన్నారు. వెంకటగిరిలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2,205 మందికి నిధులు జమచేయగా ఈ ప్రభుత్వం 1,536 మందికి మాత్రమే నిధులు విడుదల చేశారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. స్థానికంగా సజ్జా భారతమ్మ, కుడం మారెయ్య మృతి చెందినా వారి ఖాతాల్లో నేతన్న సేవలో నిధులు జమచేశారని, అలాగే దుబాయ్‌లో ఉన్న కొప్పల లక్ష్మీనారాయణ అనే వ్యక్తికి, మగ్గమే లేకుండా ఇంట్లో ఉంటున్న సత్తల హనుమంతుకి సైతం నిధులు జమైనట్టు పేర్కొన్నారు. అర్హత ఉన్న చేనేత కార్మికుడు సుబ్బారావు పేరుకు మరొకరి ఆధార్‌ లింక్‌ చేసి నగదు వేరే ఖాతాల్లో జమయ్యేలా కూటమి నేతలు దోపిడీకీ పాల్పడినట్లు ఆరోపించారు.

న్యాయం జరిగే వరకు పోరాడుతాం

అర్హత ఉన్న ప్రతి చేనేత కార్మికుడి ఖాతాల్లో నిధులు జమయ్యేవరకు చేనేత కార్మికుల పక్షాన నిలిబడి పోరాటం చేస్తామని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు రాజకీయ నాయకుల మాటలు విని తప్పులు చేయొద్దని సూచించారు.

సెప్టెంబర్‌లో వార్డుల పర్యటన

సెప్టెంబర్‌ నుంచి మున్సిపాలిటీలోని వార్డుల పర్యటన ప్రారంభించనున్నట్లు నేదురుమల్లి తెలిపారు. వార్డుల్లో నెలకొని ఉన్న మౌలిక సమస్యలను తెలుసుకుని ప్రజల పక్షాన నిలబడేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పులి ప్రసాద్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కాల్తిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వెందోటి కార్తీక్‌రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు తూపాటి చెంచయ్య, కూనా మల్లికార్జున్‌, చింతం రంగరాజు, వలికల కృష్ణయ్య, తూపాటి శ్రీనివాసులు, సదానందరెడ్డి, శ్రీనివాసులురాజు, నారాయణరెడ్డి, రామతులసి, కళ్యాణి, పూజారి లక్ష్మి, రమణమ్మ, మంగళపూరి వెంకటేశ్వర్లు, తూపాటి కాటయ్య, కల్లు సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement