తిరుపతిలో దందా సాగిస్తున్న ట్రాఫిక్‌ నియంత్రణ వర్గాలు తోపుడుబండ్ల నుంచి హోటళ్ల వరకు యథేచ్ఛగా వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

తిరుపతిలో దందా సాగిస్తున్న ట్రాఫిక్‌ నియంత్రణ వర్గాలు తోపుడుబండ్ల నుంచి హోటళ్ల వరకు యథేచ్ఛగా వసూళ్లు

Aug 17 2026 1:47 AM | Updated on Aug 17 2026 1:47 AM

● అధికారుల పేరిట నగదు గుంజుతున్నట్లు ఆరోపణలు ● ట్రావెల్‌ బస్సులకు మాత్రం ప్రత్యేక వెసులుబాటుపై విమర్శలు ● ఆటో.. ట్యాక్సీ నిర్వాహకులపై తీవ్రంగా ఒత్తిళ్లు ● సమగ్ర విచారణకు డిమాండ్‌ చేస్తున్న నగరవాసులు ● ట్రాఫిక్‌ విభాగం పేరు చెప్పి ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ● అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు బయటపడితే బాధ్యులపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు చేపట్టాలి. ● ఆరోపణలు నిరాధారమైతే.. వాటిపై అధికారికంగా స్పష్టత ఇవ్వాలి. నిబంధనల అమలు పేరుతో పేద చిరు వ్యాపారులపై ఒత్తిడి ఉండకూడదు. అదే సమయంలో రోడ్లను ఆక్రమించే పెద్ద వాహనాలు, ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై కూడా సమానంగా చట్టం అమలు కావాలి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక నగరంలో ట్రాఫిక్‌ వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు. అవి నిజమా? కాదా? అన్నది తేల్చాల్సిన బాధ్యత అధికారులదే. ఇప్పుడు నగరవాసులు ఎదురుచూస్తున్నది ఒక్కటే. ‘‘వసూళ్ల ఆరోపణల వెనుక అసలు నిజం ఏమిటి?’’ సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు.

● అధికారుల పేరిట నగదు గుంజుతున్నట్లు ఆరోపణలు ● ట్రావెల్‌ బస్సులకు మాత్రం ప్రత్యేక వెసులుబాటుపై విమర్శలు ● ఆటో.. ట్యాక్సీ నిర్వాహకులపై తీవ్రంగా ఒత్తిళ్లు ● సమగ్ర విచారణకు డిమాండ్‌ చేస్తున్న నగరవాసులు

ఉన్నతాధికారులు స్పందించాలి

తిరుపతి క్రైమ్‌: తిరుపతి నగరంలోని ఫుట్‌పాత్‌లు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌, తిరుమల బైపాస్‌ తదితర ప్రాంతాల్లో చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న తోపుడుబండ్ల నిర్వాహకులు నెలవారీ మామూళ్లు చెల్లించలేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారుల వాదనల ప్రకారం.. సాధారణ తోపుడుబండ్ల నుంచి నెలకు రూ.500 నుంచి రూ.2వేలు, మొబైల్‌ బండ్లకు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే బండి తొలగిస్తామని, వ్యాపారం చేసుకోనివ్వమని హెచ్చరిస్తున్నారని కొందరు చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ సంపాదనతో కుటుంబాలను పోషించుకునే తమపై ఇలాంటి నెలవారీ భారం మోపడం అన్యాయమని వాపోతున్నారు.

డబ్బులు ఇవ్వకపోతే చర్యలు

ఈ వ్యవహారంలో మరింత ఆందోళన కలిగిస్తున్న అంశమేంటంటే అధికారుల పేర్ల ప్రస్తావన. మామూళ్లు చెల్లించకుంటే బండ్లు తొలగిస్తామని చెబుతూ అధికారుల పేర్లు చెప్పి ఒత్తిడి చేస్తున్నారని కొందరు వ్యాపా రులు ఆరోపిస్తున్నారు. అసలు అధికారులకు ఈ వసూళ్లతో సంబంధం ఉందా? లేక వారి పేర్లను అడ్డుపెట్టుకుని మరెవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారా? ఈ రెండు అంశాల్లో నిజం ఏదైనా.. సమగ్ర విచారణ జరిగితేనే స్పష్టత వచ్చే అవకాశముంది.

కార్మికుల అసంతృప్తి

రైల్వే స్టేషన్‌న్‌, బస్టాండ్‌ పరిసరాల్లోని ఆటో, ట్యాక్సీ వర్గాల విషయంలోనూ ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనియన్ల నుంచి భారీ మొత్తాలు డిమాండ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై కార్మిక వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎన్ని ఫిర్యాదులు అందాయి? ఎవరు ఫిర్యాదు చేశారు? ఎంత మొత్తానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి? అనే వివరాలు అధికారికంగా వెలుగులోకి రావాల్సి ఉంది.

పెద్దలకు మినహాయింపులా?

రోడ్డుపై చిన్న తోపుడుబండి పెట్టుకున్న వ్యక్తిపై నిబంధనల పేరుతో చర్యలు తీసుకుంటే.. అదే రోడ్డుపై పెద్ద వాహనాలు గంటల తరబడి నిలిచినా ఎందుకు అదే స్థాయిలో చర్యలు ఉండవు? చిరు వ్యాపారులపై నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ.. భారీ వాహనాల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నిజమైతే ఇది తీవ్రమైన విషయం. ట్రాఫిక్‌ నియంత్రణలో నిబంధనలు వ్యక్తిని బట్టి మారకూడదన్నదే నగరవాసుల అభిప్రాయం.

విచారణ జరిగితేనే..

ఈ వ్యవహారానికి సంబంధించి కొందరు బాధితుల వద్ద ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. వసూళ్లకు సంబంధించిన చెల్లింపుల వివరాలు, సందేశాలు, సంభాషణలు, ఇతర సమాచారాన్ని అధికారులు పరిశీలిస్తే ఆరోపణల్లో వాస్తవం ఎంత? అన్నది తేలే అవకాశముంది. అందువల్ల బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేసే విధంగా రహస్య ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేసి, వచ్చిన ప్రతి ఫిర్యాదును ఉన్నతస్థాయి అధికారులు స్వయంగా పరిశీలించాలని నగరవాసులు కోరుతున్నారు.

హోటళ్లకు సైతం వేధింపులు

చిరు వ్యాపారులతో వ్యవహారం ఒకవైపు ఉంటే.. నగరంలోని కొన్ని హోటళ్ల విషయంలోనూ ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్‌ నిర్వాహకుల నుంచి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు మొత్తాలు డిమాండ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. చెల్లింపులకు నిరాకరిస్తే ట్రాఫిక్‌ నిబంధనల పేరుతో ఇబ్బందులు సృష్టిస్తున్నారని, హోటళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడం, వాహనాల పార్కింగ్‌పై చర్యలు తీసుకోవడం వంటి అంశాలను కొందరు నిర్వాహకులు ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా ఉచితంగా గదులు, భోజనం కోరుతున్నారని కూడా వెల్లడిస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఉన్న ఆధారాలను అధికారులు పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement