తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ ఆక్టోపస్ సర్కిల్ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 90,293 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 53,090 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.6 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 22 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
నేడు
‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. ఫోన్ చేసిన సమయంలో వినియోగ దారులు తమ విద్యుత్ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సీఎండీ కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సర్కిల్ స్థాయిలో ‘డయల్ యువర్ ఎస్‌ఈ’
ఈ క్రమంలోనే సర్కిల్ స్థాయిలో ప్రతి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్‌ఈ’ నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వినియోగదారులు తిరుపతి: 8712652679, చిత్తూరు: 7993147979, నెల్లూరు: 08612320427, అన్నమయ్య: 94408 17449, వైఎస్సార్ కడప: 08562242457, కర్నూలు: 7382614308, నంద్యాల: 7382618976, అనంతపురం: 9154790350, శ్రీసత్యసాయి: 9490615721 నంబర్లకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ప్రతి విభాగానికి చెందిన జిల్లా అధికారి హజరుకావాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఇప్పటికే గ్రీవెన్స్‌లో అర్జీలు సమర్పించిన వారు మళ్లీ ఇవ్వాల్సిన పనిలేదని, తమ వద్ద ఉన్న రశీదును చూపిస్తే సరిపోతుందని చెప్పారు. అలాగే మీ కోసం డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో అన్‌లైన్ ద్వారా కూడా వినతిని నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. అర్జీకి సంబందించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేస్తే సరిపోతుందని వివరించారు. సమస్య పరిష్కారం అయితే మీ మొబైల్‌కు మెసెజ్ వస్తుందని తెలిపారు.
ఘనంగా కశ్యప జయంతి
తిరుమల: శ్రావణమాస హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో శ్రీకశ్యప మహర్షి జయంతిని ఆదివారం ఆస్థాన మండపంలో వైభవంగా నిర్వహించారు. వైఖానస పండితుల ప్రసంగాలు, చర్చాగోష్టి చేపట్టారు. పండితులు మాట్లాడుతూ భగవత్ శాస్త్ర పరంపరలో కశ్యప మహర్షి రచించిన ‘కశ్యప జ్ఞానకాండ’ గ్రంథానికి విశిష్ట స్థానం ఉందన్నారు. శ్రీవారి ఆరాధనా విధానంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది వైఖానస దేవాలయాల్లో ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా వినియోగిస్తున్నారని తెలిపారు. వైఖానస ఆగమ సంప్రదాయంలో కశ్యప జ్ఞానకాండకు ఎంతో ప్రాధాన్యత ఉందని వెల్లడించారు. రొంపిచర్ల పార్థసారథి భట్టాచార్యుల పరిష్కరణతో కశ్యప జ్ఞానకాండ గ్రంథాన్ని టీటీడీ ముద్రించి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. తిరుమల శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యులు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ అధ్యాపకులు డాక్టర్ నారాయణం తనూజ విష్ణువర్ధన్‌న్ పాల్గొన్నారు. వక్తలుగా డాక్టర్ నారాయణం కాకుమాను సిద్ధాంతి, అలంకారరత్న ఏవీఏ దీక్షితులు, జీవీఎల్‌ఏ శ్రావణ్‌కుమార్ ప్రసంగించారు. గోవర్ధనం రఘునాథ్ పాల్గొన్నారు.


