తీర్ధ యాత్రలకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

తీర్ధ యాత్రలకు ప్రత్యేక రైళ్లు

Aug 17 2026 1:47 AM | Updated on Aug 17 2026 1:47 AM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ : తీర్ధ యాత్రలకు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం సెప్టెంబరు 23 నుంచి నవంబరు 2వ తేదీ వరకు మూడు ప్రత్యేక ప్యాకేజీలను భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ రైలు ద్వారా ప్రారంభిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ (జేజేఎం) సోమ శేఖర్‌ నాయుడు వెల్లడించారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సప్తజ్యోతిర్లింగ దర్శన యాత్రలో భాగంగా ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్‌, పూణే, నాసిక్‌, ఔరంగాబాద్‌ తదితర క్షేత్రాల దర్శనీయ యాత్ర ఉంటుందని వివరించారు. ఒక వ్యక్తికి స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.18వేలు, 3ఏసీ ధర రూ.27,400లు, 2ఏసీ ధర రూ.35,500లు ఉంటుందని వెల్లడించారు.

దివ్య దక్షిణ యాత్ర

తిరువణ్ణామలై, చిదంబరం, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి తదితర క్షేత్రాల సందర్శన యాత్ర అక్టోబర్‌ 6న ప్రారంభమై 14వ తేదీ వరకు నడుస్తుందన్నారు. దీనికి ఒక్కొకరికి స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.15,800లు, 3 ఏసీ క్లాస్‌ టికెట్‌ ధర రూ.23,200లు, 2 ఏసీ క్లాస్‌ టికెట్‌ ధర రూ.29,600లు ఉంటుందని తెలిపారు.

అయోధ్య– కాశీ యాత్ర

పూరి, కోణార్క్‌, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్‌, బైద్యనాథ్‌ ధామ్‌ పుణ్యక్షేత్రాల దర్శనంతో కూడిన ఈ ప్రత్యేక పర్యాటక యాత్ర అక్టోబర్‌ 24న ప్రారంభమై నవంబర్‌ 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ యాత్రకు ఒక్కొక్కరికి స్లీపర్‌ క్లాస్‌ ప్యాకేజీ ధర రూ.17 వేలు, 3 ఏసీ క్లాస్‌ ప్యాకేజీ ధర రూ.26,400లు, 2 ఏసీ క్లాస్‌ ప్యాకేజీ ధర రూ.34,400 గా నిర్ణయించినట్లు తెలిపారు. భోజన, వసతి ఉంటుందని చెప్పారు. ప్రతి ప్రయాణికుడికి ఉచిత బీమా ఉచిత సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9281495853, 8287932313, 9281030772, 9281030785, 9281030773 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement