సాక్షి టాస్క్ ఫోర్స్ : శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాకంబరీ ఉత్సవం నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి సంబంధించిన పూజలు, ఉత్సవాలు, ఆచార సంప్రదాయాలను నిర్దిష్ట రికార్డుల ఆధారంగా కొనసాగాల్సి ఉంది. తాజాగా శాకాంబరీ ఉత్సవం నిర్వహించిన తీరుపై భక్తుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఉత్సవం ఆలయ సాంప్రదాయంలో భాగమా? రిజిస్టర్–43లో దీనికి సంబంధించిన నమోదు ఉందా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దేవదాయ శాఖ చట్టం–1987లోని సెక్షన్43 ప్రకారం ఆలయానికి సంబంధించిన వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో కేవలం ఆలయానికి చెందిన భూములు, భవనాలు, ఇతర స్థిర, చర ఆస్తుల వివరాలే కాకుండా ఆలయ ఆచారాలు, సంప్రదాయాలు, ప్రత్యేక హక్కులు, అమలులో ఉన్న పద్ధతులు, విగ్రహాలు, ఉత్సవమూర్తులు, జాతరలు, వార్షిక ఉత్సవాలు, దైనందిన పూజలు, కాలానుగుణ పూజలు, సేవలు, ఇతర మతపరమైన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన దిట్టం వంటి అంశాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే ఆలయంలో నిర్వహించే పూజలు, ఉత్సవాలు, సేవలను సంప్రదాయబద్ధంగా జరిపించాలి. ఈ మేరకు రిజిస్టర్–43లో కీలక అధికారిక రికార్డు ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించిన శాకంబరీ ఉత్సవానికి సంబంధించి 43 రిజిస్టర్‌లో నమోదు ఉందా.. లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆషాఢానికి బదులు శ్రావణంలో..
సాధారణంగా శాకంబరీ ఉత్సవాలను ఆషాఢ మాసంలోనే పలు ఆలయాల్లో నిర్వహిస్తుంటారు. శ్రీకాళహస్తిలో మాత్రం శ్రావణమాసం ప్రారంభం రోజున ఉత్సవం జరిపించడం భక్తుల్లో చర్చకు దారితీసింది. ఆలయానికి సంబంధించిన సంప్రదాయ ఉత్సవాల విషయంలో కాలం, విధానం, పూజా క్రమం తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఈ ఉత్సవం నిర్వహణకు ముందు సంబంధిత పండితులు, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిగాయా? నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు, ఆమోదాలు తీసుకున్నారా? అనేది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.
అలంకరణపైనా అభ్యంతరాలు
శాకంబరీ ఉత్సవంలో భాగంగా ఆలయ అలంకరణలో డ్రాగనన్‌్ ఫ్రూట్ వంటి ఫలాలను వినియోగించడంపైనా కొందరు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అలంకరణలో సాధారణంగా అనుసరించే సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఇటువంటి ఫలాలను వినియోగించాల్సిన అవసరం ఏంటో అధికారులు వివరించాలని కోరుతున్నారు.
రిజిస్టర్‌లో ఉందా..?
ఆలయ సంప్రదాయాల్లో భాగమైన పూజలు, ఉత్సవాలను రిజిస్టర్–43లో నమోదు చేయాలి. శాకంబరీ ఉత్సవం శ్రీకాళహస్తీశ్వరాలయ రిజిస్టర్–43లో ఎప్పటి నుంచి నమోదై ఉంది? ఏ విధంగా నిర్వహించాలనే విధానం అందులో ఉందా? దానికి దిట్టం నిర్ణయించబడిందా? అనే ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఒక ఉత్సవం రిజిస్టర్‌లో నమోదై ఉంటే దాని ఆధారంగా ఆలయ సంప్రదాయంలో దాని స్థానం, నిర్వహణ విధానం, పూజా క్రమం, అవసరమైన సామగ్రి, దిట్టం వంటి అంశాలను పరిశీలించేందుకు అవకాశముంటుంది. అందువల్ల రిజిస్టర్–43లో శాకంబరీ ఉత్సవానికి సంబంధించిన నమోదు ఉంటే దానిని అధికారులు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. నమోదు లేకుంటే ఏ నిబంధనల ఆధారంగా ఉత్సవం జరిపించారో కూడా స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


