జూడాల సమ్మె ఉధృతం
– అత్యవసర సేవలకు అంతరాయం
తిరుపతి తుడా : స్టయిఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు రుయా ఆస్పతి వద్ద చేపట్టిన సమ్మెను సోమవారం నుంచి మరింత ఉధృతం చేయనున్నట్లు జూడాలు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఇంతవరకు బాద్యతాయుతంగా వ్యవహరిస్తూ అత్యవసర సేవలను కొనసాగించామని, కేవలం సాధారణ ఓపీ సేవలను నిలిపివేశామని వెల్లడించారు. అయితే తమ సమస్యలు, స్టయిఫండ్ పెంపుపై ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర సేవలను సైతం నిలిపివేసేందుకు వెనకాడమని హెచ్చరించారు. తక్షణం ప్రభుత్వ జోక్యం చేసుకుని స్టయిఫండ్ పెంపుపై లిఖిత పూర్వకమైన కాలవ్యవధితో కూడిన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రెండు ఆలయాల్లో చోరీ
కలువాయి(సైదాపురం) : మండలంలోని పర్లకొండలో ఉన్న పోలేరమ్మ, మాతమ్మ ఆలయాల్లో ఆదివారం వేకువజామున గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవార్ల తాళిబొట్లు, హుండీలను అపహరించారు. అయితే మాతమ్మతల్లికి అలంకరించింది మాత్రం రోల్డ్‌గోల్డ్ తాళిబొట్టని పూజారులు వెల్లడించారు. హుండీల్లో సుమారు రూ.10వేల నగదు ఉంటుందని తెలిపారు. పగులగొట్టిన హుండీలను సమీపంలోని వాగులో పడేసి వెళ్లిపోయారన్నారు.
నేటి నుంచి ఆధ్యాత్మిక
సేవలపై జాతీయ సదస్సు
తిరుపతి కల్చరల్ : అన్నమాచార్య కళామందిరంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్యులు, ఆచార్య పుండరీకాక్షులు, శ్రీగోవింద భట్టర్, దాశరథి జీవితం, ఆధ్యాత్మిక సేవలు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారం, ఆలయ ఆచార– సంప్రదాయాల పరిరక్షణలో వారు చేసిన విశిష్ట కృషిపై పరిశోధనాత్మక చర్చలు చేపట్టనున్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 25 మంది పరిశోధకులు, పలువురు పండితులు ఈ సదస్సులో పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. ఈమేరకు సోమవారం ఉదయం 10 గంటలకు తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామివారి మంగళశాసనాలతో సదస్సును ప్రారంభించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి 2 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు సదస్సు కొనసాగుతుందని టీటీడీ చీఫ్ పీఆర్‌ఓ టి.రవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
సత్యవేడు : సత్యవేడు పంచాయతీ కోమటి గుంటకు చెందిన సోమరాజు భార్య ఎస్.రమ్య( 28) కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన రమ్య పదేళ్ల క్రితం ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో అక్కడ తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్న సోమరాజును ప్రేమించి పెళ్లి చేసుకొంది. వీరికి ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. రమ్య ప్రస్తుతం శ్రీసిటీలోని కంపెనీలో పనిచేస్తోంది.సోమరాజు తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా సోమరాజు రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొడుతూ, తిడుతూ వేధించే వాడు. ఈక్రమంలో శనివారం రాత్రి 11 గంటలకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రమ్య ఉరేసుకుంది. మృతురాలి తండ్రి నటరాజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయినాథ్‌చౌదరి తెలిపారు.
భవనం అద్దెకు ఇస్తానని మోసం
తిరుపతి క్రైం : వస్త్ర దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు భవనం అద్దెకు ఇస్తానని నమ్మించి రూ.2.50 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని మోసం చేసిన ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బెంగళూరుకు చెందిన పూజల మీనా (40) తన భర్త ప్రభాకర్‌తో కలిసి గార్మెంట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా తిరుపతి కొర్లగుంట మెయిన్‌రోడ్డులోని నూతన భవనంలో వస్త్ర దుకాణం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 2024 అక్టోబర్‌లో భవనం యజమాని ఢిల్లీబాబును సంప్రదించి.. రూ.3 లక్షల అడ్వాన్స్, నెలకు రూ.40 వేల అద్దెకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం విడతల వారీగా ఫోన్‌పే ద్వారా రూ.2.50 లక్షలను అడ్వాన్స్‌గా ఢిల్లీబాబుకు చెల్లించారు. అయితే భవనాన్ని అప్పగించేందుకు కొంత సమయం కావాలని చెబుతూ కుటుంబ కారణాలను సాకుగా చూపి ఆయన పలుమార్లు కాలయాపన చేశారు. చివరకు భవనాన్ని అప్పగించకపోగా.. చెల్లించిన అడ్వాన్స్ సొమ్మును కూడా తిరిగి ఇవ్వనని చెప్పి బెదిరించినట్లు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు


