చంద్రగిరి : ఏళ్ల తరబడి తమ ఆధీనంలోని భూమిని టీడీపీ నేత ఆక్రమించుకోవడానికి యత్నించడంపై గిరిజనులు మండిపడ్డారు. తమ భూమిని రక్షించి పట్టా మంజూరు చేయాలని కోరుతూ బుధవారం చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. వివరాలు.. మండలంలోని నడింపల్లి ఎస్టీ కాలనీకిచెందిన గురవయ్య సుమారు 20 ఏళ్లుగా గ్రామంలో రెండు సెంట్ల భూమిని తన స్వాధీన అనుభవంలో ఉంచుకున్నాడు. ఇటీవల గురవయ్య మృతి చెందాడు. ఈ క్రమంలో ఆయన తనయుడు బత్తయ్య సదరు రెండు సెంట్ల భూమిలో ఇంటి నిర్మాణం తలపెట్టాడు. అయితే నడింపల్లికి చెందిన టీడీపీ నేత సాగర్ నాయుడు నిర్మాణాలను అడ్డుకున్నట్లుగా గిరిజనులు తెలిపారు. తన తండ్రి నుంచి సంక్రమించిన భూమిలో ఇల్లు నిర్మించుకోవడానికి యత్నిస్తుంటే, అడ్డుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తహసీల్దార్ అమరేశ్వరి ఈమేరకు బాధితులతో చర్చించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పట్టాల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


