వైద్యం.. అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

వైద్యం.. అస్తవ్యస్తం

Aug 13 2026 1:45 AM | Updated on Aug 13 2026 1:45 AM

స్టాఫ్‌ నర్సులకు డాక్టర్ల విధులు

ఆందోళనలో రోగులు

సిబ్బంది ఇష్టారాజ్యంలో పీహెచ్‌సీలు

పట్టించుకోని ఉన్నతాధికారులు

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రజారోగ్య రక్షణకు ఏర్పాటు చేసిన పీహెచ్‌సీలు అస్తవ్యస్తంగా మారాయి. నిపుణులైన స్టాఫ్‌ నర్సులను వైద్యుల విధుల్లో వినియోగించుకుని.. అర్హత లేని వారికి ఓపీ డ్యూటీలు అంటకడుతున్నారు. అనారోగ్యంతో పీహెచ్‌సీలకు వచ్చే రోగులు విధిలేక భయంతో వణికిపోతున్నారు. రెండు రోజుల క్రితం రేణిగుంట పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంలే విధులు నిర్వర్తించడమే ఇందుకు నిదర్శనం. వైద్యం కోసం పట్టణాలు.. నగరాలకు రాలేని గ్రామీణ ప్రాంతాల వారి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పర్యవేక్షణ కరువైంది. దీంతో అనేక మంది అత్యవసర చికిత్సల కోసం నగరాలు, పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో కలిపి 134 పీహెచ్‌సీలు ఉన్నాయి. కొన్ని పీహెచ్‌సీలో అవసరమైన స్టాఫ్‌ నర్సులు ఉన్నా వారు ఓపీ విధులు నిర్వర్తించడం లేదు. నైపుణ్యం లేని ఏఎన్‌ఎంలకు విధులు అప్పగించి స్టాఫ్‌ నర్సులు సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఏఎన్‌ఎంలు పగలంతా వ్యాక్సినేషన్‌, ఫ్యామిలీ డాక్టర్‌, ఫీవర్‌ సర్వే, శానిటేషన్‌ కార్యక్రమం, లెప్రసీ సర్వేల పనిభారంతో నలిగిపోతున్నారు. అటువంటి వారిని రాత్రివేళల్లో స్టాఫ్‌ నర్సుల డ్యూటీలు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇదీ..

రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు స్టాఫ్‌ నర్సులు ఉన్నారు. వీరు రాత్రి డ్యూటీలకు హాజరు కావడం లేదు. కేవలం పగలు పీహెచ్‌సీలో ఓపీ లేదా డాక్టర్‌ లేకపోతే ఆయన బాధ్యతలు చూసుకుని వెళ్లిపోతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని రోగులు పలు మార్లు సాక్షి దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఓ రోగి బంధువుతో కలిసి సాక్షి ఆదివారం రాత్రి రేణిగుంట పీహెచ్‌సీని విజిట్‌ చేసింది. పీహెచ్‌సీ చుట్టూ చిమ్మ చీకటి.. నిర్మానుష్యంగా ఉంది. పీహెచ్‌సీ ప్రధాన ద్వారం మూసివేసి ఉంది. లోపల విద్యుత్‌ బల్బులు వెలుగుతున్నాయి. వాచ్‌మన్‌ లేడు. పీహెచ్‌సీ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి ‘ఎవరైనా ఉన్నారా?’ అని పిలవడ జరిగింది. బిక్కు బిక్కు మంటూ ఇద్దరు ఏఎన్‌ఎంలు కిటికీల్లో నుంచి తొంగిచూసి ఎవరు, ఎవరు అంటూ సమాధానం ఇచ్చారు. తలుపు తీయమన్నా తీయలేదు. తలుపులు మూసుకుని లోపలు ఎవరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ఎందుకు తలుపులు వేసుకున్నారంటే.. వాచ్‌మన్‌ లేరు అన్నారు. ఎవరు మీరు అని అడిగితే ఏఎన్‌ఎంలనిని సమాధానం ఇచ్చారు. స్టాఫ్‌ నర్సులు ఏమయ్యారు? అని ప్రశ్నించగా.. మౌనంగా ఉండిపోయారు.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి తయారైంది. ఆధునిక పరికరాలు ఉన్నప్పటికీ ప్రజల కోసం ఉపయోగించరు. అన్ని రకాల మందులు ఉన్నప్పటికీ రోగులకు సరిపడా పంపిణీ చేయరు. అవసరాలకు అనుగుణంగా సిబ్బంది ఉన్నప్పటికీ సక్రమంగా విధులు నిర్వర్తించరు. వైద్యం అంటే ఓ సేవగా భావించాల్సింది పోయి.. కేవలం జీతం కోసమే అన్నట్లు పనిచేస్తుంటారు. ప్రశ్నించివారికి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుంటారు. అవకాశం దొరికితే ఎలా పని ఎగ్గొట్టాలా అన్నట్టే చూస్తుంటారు. పక్కవారిపై పనులను నెట్టేసి దర్జాగా కాలక్షేపం చేస్తుంటారు. అందులో భాగంగానే రేణిగుంట పీహెచ్‌సీలో వెలుగుచూసిన అలసత్వంపై ప్రత్యేక కథనం.

ఏఎన్‌ఎంలకే ఓపీ డ్యూటీలు

ఇంటి వద్దే స్టాఫ్‌ నర్సులు

రేణిగుంట పీహెచ్‌సీలో పనిచేసే ముగ్గురు స్టాఫ్‌ నర్సులు ఇంటి వద్ద ఉన్నట్లు తెలిసింది. వారి విధులను అర్హత లేని ఏఎన్‌ఎంలు నిర్వహిస్తున్నారు. పీహెచ్‌సీకి గర్భిణి డెలివరీ కోసం వస్తే వీరు ఏం చేయలేరు. చేసినా ఏదైనా పొరబాటు జరిగితే గర్భిణికి లేదా బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశముంది. కడుపు నొప్పితో ఎవరైనా వస్తే.. సరైన ట్రీట్‌ మెంట్‌ ఇచ్చే నైపుణ్యం ఏఎన్‌ఎంలకు ఉండదు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా.. వీరు సరైన చికిత్స చేసే పరిస్థితి లేదు. ఇది ఒక్క రేణిగుంట పీహెచ్‌సీలోనే కాదు.. జిల్లాలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ డ్యూటీలను ఏఎన్‌ఎంలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయాన్ని పీహెచ్‌సీ హెల్త్‌ ఆఫీసర్‌ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు కారణం లేకపోలేదు. వైద్యులు పీహెచ్‌సీకి వచ్చినా.. రాకపోయినా వారి విధులను స్టాఫ్‌ నర్సులు నిర్వహిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అందు కోసమే స్టాఫ్‌ నర్సులకు రాత్రుల్లో ఓపీ డ్యూటీలు వేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని రోగులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement