ఏటీఎం కార్డు మార్చి నగదు అపహరణ | - | Sakshi
Sakshi News home page

ఏటీఎం కార్డు మార్చి నగదు అపహరణ

Aug 13 2026 1:45 AM | Updated on Aug 13 2026 1:45 AM

నాగలాపురం : స్థానిక ఎస్‌బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి డెబిట్‌ కార్డు మార్చి రూ.27 వేలు కాజేసిన ఘటన బుధవారం ఉదయ జరిగింది. బాధితుడి కథనం మేరకు.. పిచ్చాటూరుకు చెందిన అరుళ్‌మొయి నాగలాపురం స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో వెనుక ఉన్న గుర్తు తెలియని వ్యక్తి తొందర పెడుతున్నట్లు నటించి ఏటీఎం కార్డును మార్చేశాడు. ఈ విషయం గమనించకుండా ఇంటికి వెళ్లిన అరుళ్‌కు తన బ్యాంకు ఖాతా నుంచి వరుసగా రూ.10వేలు రెండు సార్లు, రూ.7 వేలు ఒకసారి మొత్తం రూ.27 వేల నగదు డెబిట్‌ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఏటీఎం కార్డును పరిశీలించగా కార్డు మారిన విషయం గుర్తించి వెంటనే నాగలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

22 నుంచి పీజీ పరీక్షలు

తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో పలు పీజీ కోర్సులకు సంబంధించి రెండవ సెమిస్టర్‌ను ఈనెల 22 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల డీన్‌ ఆచార్య సురేంద్ర బాబు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ రాజమాణిక్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే అన్ని సబ్జెక్టుల మొదటి సెమిస్టర్‌ ఫలితాలను ఈ వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఏనుగులకు ఘన సత్కారం

తిరుపతి రూరల్‌: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా తిరుపతి ఎస్వీ గోశాలలో బుధవారం లక్ష్మి, వైష్ణవి, పద్మావతి అనే మూడు ఆడ ఏనుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏనుగులు ఏళ్లుగా స్వామివారి సేవలో భాగస్వాములవుతున్నాయి. వీటిని కేవలం జంతువులుగా కాకుండా ఆలయ సంప్రదాయాల్లో భాగస్వాములుగా భావిస్తూ టీటీడీ ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తోంది. ఏనుగుల ఆరోగ్యం, పోషణ, సంక్షేమంపై నిరంతరం పర్యవేక్షణ చేపడుతోంది. గోశాల డైరెక్టర్‌ ఏవీఎన్‌ శివకుమార్‌ పాల్గొన్నారు.

ఫిన్లాండ్‌కు బాలసుబ్రమణ్యం

తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్‌): తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్‌ స్కూల్‌ ఉపాధ్యాయుడు బాలసుబ్రమణ్యం ఫిన్లాండ్‌లో చేపట్టే శిక్షణకు ఎంపికయ్యారు. బుధవారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్తులు జారీ చేసింది. ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, అభ్యాస నైపుణ్యాలను బలోపేతం చేయడానికి ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్‌లోని తుర్కు యూనివర్సిటీలో శిక్షణ తరగతులు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో బాలసుబ్రమణం 15వ తేదీన ఫిన్లాండ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు..

‘అన్నమాచార్య’లో

అడ్మిషన్లు పూర్తి

రేణిగుంట : అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కళాశాలలో ఏపీ ఈఏపీ సెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బీటెక్‌ కోర్సులలో నూరు శాతం అడ్మిషన్లు సాధించినట్లు సంస్థ వ్యవస్థాపకులు గంగిరెడ్డి, ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ నాధముని రెడ్డి వెల్లడించారు. బుధవారం వారు మాట్లాడుతూ తమ కళాశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement