శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయాలకు ప్రత్యేక పాలకమండళ్లను నియమించలేదని దేవదాయశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. ముక్కంటి ఆలయ కమిటీనే ఆయా గుళ్లకు పాలకమండిగా వ్యవహరిస్తుందని తెలిపారు. అనధికారికంగా ఎవరైనా పాలకమండలి పేరుతో పెత్తనం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్థానికంగా బోర్డుల ఏర్పాటు?
కమిషనర్ ప్రకటనకు భిన్నంగా శ్రీకాళహస్తిలో పరిస్థితులు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన ఆలయ పాలకమండలిలో పదవులు దక్కని కొందరు కూటమి నేతలకు అనుబంధ ఆలయాల్లో పదవులు కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కూటమి నాయకుల అండతో అనుబంధ ఆలయాలకు స్థానికంగా బోర్డులు ఏర్పాటు చేసి, అందులోని సభ్యులు చైర్మన్లుగా వ్యవహరిస్తూ ఆలయాల్లో అజమాయిషీ చలాయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అనుబంధ ఆలయాల్లో జరిగే ముఖ్య ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల్లో వీరి జోక్యం పెరగడంపై భక్తులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు అనుబంధ ఆలయాలకు ప్రత్యేకంగా బోర్డులు లేవని కమిషనర్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. స్థానికంగా ఏర్పాటు చేసిన బోర్డులు ఎవరి అనుమతితో కొనసాగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జీవో లేకుండానే బోర్డులు?
ప్రభుత్వం నుంచి ఎలాంటి జీఓ లేదా నియామక ఉత్తర్వులు లేకుండానే తామే చైర్మన్లు, బోర్డు సభ్యులమంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొందరు తమ వాహనాలపై కూడా చైర్మన్‌న్ , బోర్డు సభ్యుల హోదాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఆలయ అధికారులు, సిబ్బంది, వేద పండితులు వారికి ప్రోటోకాల్ కల్పిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.


