ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డు ధ్వంసం శ్రీకాళహస్తి రూరల్ మండలంలో టీడీపీ బరితెగింపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టినా.. దాన్ని దౌర్జన్యంగా తొలగించారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం, ఇనగలూరు రెవెన్యూ పరిధిలోని జగ్గరాజుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సర్వే నం.107/12, 280/4, 20లోని విలువైన ప్రభుత్వ, రోడ్డు పోరంబోకు భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణపై సాక్షి దిన పత్రికలో ఈనెల 18న ‘కబ్జా చేసి.. దర్జాగా ప్రహరీ నిర్మించి’ శీర్షికన వార్త వెలువడింది. ఏర్పేడు– వెంకటగిరి మార్గంలో ఉన్న ఈ విలువైన ప్రభుత్వ భూమి ప్రభుత్వానిదే అని బోర్డులో స్పష్టంగా రాసి, నాటారు. ఆ బోర్డును టీడీపీ నేతలు పీకేశారు. కర్రలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసి కింద పడేశారు. ఈ విషయాన్ని స్థానికలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం.


