టీటీడీకి రూ.50 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

టీటీడీకి రూ.50 లక్షల విరాళం

Jul 15 2026 12:29 AM | Updated on Jul 15 2026 12:29 AM

తిరుమల: టీటీడీకి మంగళవారం పలువురు దాతలు రూ.50 లక్షలను విరాళంగా అందజేశారు. గుంటూరుకు చెందిన బృందా న్యూరో సెంటర్‌ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్‌ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ అధినేతలు డాక్టర్‌ హనుమ శ్రీనివాసరెడ్డి, సిద్ధార్థ శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు. అదేవిధంగా బెంగళూరుకు చెందిన శ్రీపతి శ్రీనివాస్‌, కొటారు సునీల్‌ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించగా, విశాఖపట్నంకు చెందిన చాగర్లమూడి సీతారామయ్య టీటీడీ బర్డ్‌ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. వీరి తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.

దర్శనం పేరుతో టోకరా

– టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్‌

తిరుమల: శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వీఐపీ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, తోమాల, సుప్రభాత సేవలు, అతిథి గృహాల్లో వసతి కల్పిస్తానంటూ భక్తులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన టీటీడీ మాజీ ఉద్యోగిని తిరుపతి టూ టౌన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టీటీడీ విజిలెన్స్‌ అధికారులతో కలిసి చేపట్టిన సంయుక్త చర్యల్లో నిందితుడు టి.అరుణ్‌కుమార్‌ (26)ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం.. తిరుపతికి చెందిన అరుణ్‌కుమార్‌ గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసి, విధుల నుంచి తొలగించారు. అనంతరం శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు, వసతి ఇప్పిస్తానంటూ భక్తులను నమ్మించి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడేవాడు. ఇటీవల బెంగళూరుకు చెందిన రెండు కుటుంబాల నుంచి రూ.3.2 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. దర్యాప్తులో నిందితుడు ఇదే తరహా మోసాల కేసులో 2023లోనూ అరెస్టయినట్లు పోలీసులు గుర్తించా రు. గత ఏడాది కాలంలో అతని బ్యాంకు ఖాతా ల్లో సుమారు రూ.85 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ నగదు లావాదేవీలపై పోలీసులు లోతుగా దర్యా ప్తు చేపట్టారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌, రూ.99 వేల నగదు, మూడు బ్యాంకు పాస్‌బుక్కులను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ కేసులతో అడ్డుకోలేరు

చంద్రగిరి: అక్రమ కేసులతో తమను అడ్డుకోలేరని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల చంద్రగిరి ఎమ్మెల్యే నాని వ్యవహరించిన తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకోవడంతో నిరసనకు దిగారు. దీనిపై యూనివర్సిటీ పోలీసులు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మంగళవారం పోలీసులు చంద్రగిరికి చేరుకుని నేతలకు నోటీసులు జారీచేశారు. నాయకులు మాట్లాడుతూ... ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహిస్తున్న ఎమ్మెల్యే నాని, ఒక మాజీ ప్రజాప్రతినిఽధిపై బూతులతో రెచ్చిపోతే పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమపై అక్రమ కేసులు బనాయించారని, సభ్య సమాజం తలదించుకునేలా ఎమ్మెల్యే నాని వాడిన భాషపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. నోటీసులు అందుకున్న వారిలో పార్టీ నేతలు మస్తాన్‌, ఒంటి శివశంకర్‌రెడ్డి, బుల్లెట్‌ చంద్రమౌళిరెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సిద్ధిక్‌ బాషా ఉన్నారు.

కామ పిశాచి కథ అంతేనా?

తిరుపతి తుడా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఓ అధికారిపై మహిళ ఉద్యోగి చేసిన ఫిర్యాదుకు సంబంధించి డీఎంహెచ్‌ఓ ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మినిస్ట్రేషన్‌ అధికారి తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు కుయుక్తులు పన్నారు. విచారణ కమిటీని తనకు అనుకూలంగా మార్చుకోవడంతోపాటు అధికారికి అండగా తెలుగునాడు వైద్య ఆరోగ్య సంఘం కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ అధికారికి అనుకూలంగా విచారణ నివేదిక సమర్పించేందుకు వారు శతవిధాల ప్రయత్నించినట్లు సమాచారం. ఆ సంఘంలోని కొందరు నాయకులు ప్రశ్నించినా వారిని బెదిరిస్తూ.. కామ పిశాచికి అనుకూలంగా కృషి చేస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

లంచగొండు కూడా!

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్‌ అధికారిగా పనిచేస్తున్న కామపిశాచి ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి లంచాలకు పాల్పడడం అలవాటుగా మారింది. లంచం ముట్టితేగానీ ఆయన టేబుల్‌ నుంచి ఫైల్‌ కదలదు. అటువంటి వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేయడం ఎమిటని జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగు నాడు వైద్య ఆరోగ్య సంఘం నాయకులు కొందరు కార్యాలయంలో డిప్యూటేషన్‌ల పేరుతో తిష్టవేసి చక్రం తిప్పుతుండడం గమనార్హం. అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement