ఎదురెదురుగా రెండు బైకులు ఢీ ఒకరి మృతి మరో ముగ్గురికి గాయాలు
శ్రీకాళహస్తి రూరల్: ‘ఇన్నాళ్లు తాగింది చాలు. ఇంట్లో వాళ్ల పోరు తట్టుకోలేకపోతున్నాం. ఇక వద్దు. మందు(మద్యం) మానేద్దాం.. అని భావించారు. చివరి రోజు కదా అని నలుగురు వ్యక్తులు ఫుల్లుగా మద్యం సేవించారు. ఇందులో ఇద్దరు యువకులు ఓ బైకుపై మూలకండ్రిలోని సత్యప్రమాణాలకు నిలయమైన మూలస్థానమ్మ ఆలయం వద్ద ‘మందు ముట్టం’ అని ప్రమాణం చేశారు. ఆపై చేతికి దారం కట్టుకుని తిరుగుప్రయాణమయ్యారు. మరో ఇద్దరు యువకులు అమ్మవారి వద్దకెళ్లి దారం కట్టుకోవాలని శ్రీకాళహస్తి నుంచి ఇంకో బైకులో బయల్దేరారు. రెండు బైకులూ శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాళెం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికీ గాయాలయ్యాయి. ఇందులో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొదుతూ మృతిచెందాడు. సీఐ ఇబ్రహీం కథనం.. శ్రీకాళహస్తి మండలం, మేలచ్చూరు గ్రామానికి చెందిన ఎం.మునికృష్ణ (36), టి.హరి (37) కలిసి బైక్‌పై మూలకండ్రిగ గ్రామంలో వెలసిన మూలస్థానమ్మ గుడికి వెళ్లి మందుతాగమని ప్రమాణం చేశారు. ఆపై చేతికి దారం కట్టుకొని తిరిగి శ్రీకాళహస్తి వైపు బయల్దేరారు. అదే సమయంలో మన్యం జిల్లా, చిన్నబుద్ధిడి గ్రామానికి చెందిన బాలకృష్ణ (40), అప్పలనాయుడు (40) ఇంకో బైకుపై మూలకండ్రిగకు బయల్దేరారు. రెండు బైకులు అమ్మపాళెం గ్రామ సమీపాన ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికీ రక్త గాయాలయ్యాయి. మన్యం జిల్లా, చిన్నబుద్ధిడి గ్రామానికి చెందిన బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో అతనితోపాటు అప్పలనాయుడును మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలకృష్ణ మృతిచెందాడు. మునికృష్ణకు కాలు విరగడంతో అతన్ని కూడా తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నలుగురూ మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
మూలస్థానమ్మ వద్దకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం


