రేవంత్‌రెడ్డిపై పన్నీరు.. సీమ వాసులకు కన్నీరు
తిరుపతి మంగళం : తన శిష్యుడు రేవంత్‌రెడ్డి ప్రయోజనాలను కాపాడడం కోసం రేవంత్‌రెడ్డిపై పన్నీరు.. రాయలసీమ వాసులకు కన్నీరు మిగిల్చేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం ఎంత దుర్మార్గంగా ఉందో.. రాయలసీమ వాసులంతా ఆలోచించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కోరారు. రాయలసీమ వాసులకు చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబు దయవల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని చెప్పారన్నారు. ఆ పలుకులతో చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్న ద్రోహం ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమైయిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనకు అనుకూలమైన, తన శిష్యుడైన రేవంత్‌రెడ్డి ప్రయోజనాలను కాపాడడం కోసమని రాయలసీమ ప్రజల కళ్లల్లో కారం కొట్టారన్నారు. చంద్రబాబు రేవంత్‌రెడ్డితో చేస్తున్న చెలిమి రాయలసీమను తాకట్టు పెట్టేలా ఉందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ వాసుల కడగండ్లు తీర్చాలన్న సదాశయంతో రూ.4వేల కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించి, నిత్యం టీఎంసీ నీళ్లతో రాయలసీమవాసుల పొలాలను తడపాలన్న గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా రేవంత్‌రెడ్డి ప్రయోజనాలను కాపాడడం కోసమని రాయలసీమను తాకట్టుపెట్టడం వంటి ఘోరం మరొకటి లేదన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చెలికత్తె పత్రిక ఈరోజు పతాక శీర్షికలో ఒక వ్యాసం రాసిందన్నారు. ప్రభుత్వ వర్గాలు జగన్‌మోహన్‌రెడ్డే ఎత్తిపోతల పథకానికి ద్రోహం చేశారని రాశారన్నారు. ఎవరు ఆ ప్రభుత్వ వర్గాలు అంటే రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మార్చి వేసిన చందంగా ఆ చెలికత్తె పత్రిక వ్యాసముందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏమీ తెలియకపోయినా ఆ చెలికత్తె పత్రిక తన భుజాలపైకి ఎత్తుకుని వ్యాసం రాసిందన్నారు. సీమ వాసి అయిన చంద్రబాబు రాయలసీమకు ఒక మంచిపని చేసిన పాపానపోలేదని మండిపడ్డారు. రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే 1984–85 సంవత్సరాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వీరోచిత పోరాటాలతోనే పలు ప్రాజెక్టులు వచ్చాయన్నారు. గాలేరు–నగిరి, హంద్రీ–నీవా వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయంటే వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమేనని అన్నారు. ఆ నాడు రాజశేఖరరెడ్డి లేకపోయి ఉంటే రాయలసీమ వాసులకు తీవ్రమైన నష్టం జరిగి ఉండేదన్నారు. ఆయన వారసుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమకు మరింతగా రాయలసీమ వాసుల కడకండ్లను తీర్చాలన్న గొప్ప ఆలోచనలతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే ఆ చెలికత్తె పత్రిక జగన్‌మోహన్‌రెడ్డి ఏమాత్రం ప్రయత్నం చేయలేదనంటూ వ్యాసాలు రాసిందని మండిపడ్డారు. ఇక రాయలసీమ వాసులెరూ కూడా మేధావులైనా, కార్మికులైనా, కర్షకులైనా ఉపేక్షించి మౌనంగా ఉండే ప్రసక్తేలేదన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమని రాయలసీమకు చేస్తున్న అన్యాయంపై రాయలసీమ వాసులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకాన్ని మనమంతా తిరిగి సాధించుకోవడం కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేపడదామని పిలుపునిచ్చారు.


