ఐసీడీఎస్ కార్యాలయంలో ఉద్రిక్తత
తొట్టంబేడు: శ్రీకాళహస్తిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయం శుభ్రం చేస్తుండగా, తొట్టంబేడు మండలానికి చెందిన సుమారు 30 మంది రెవెన్యూ సిబ్బంది ఆర్‌ఐ, డిటీలతో కలిసి ఒక్కసారిగా సీనియర్ సహాయకుల గదిలోకి ప్రవేశించారు. ఐసీడీఎస్ ఫర్నిచర్‌ను పక్కకు జరిపి తమ ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్న రెవెన్యూ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది పక్కనే ఉన్న పంచాయతీ రాజ్ భవనానికి వెళ్లాలని గొడవకు దిగారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి రాతపూర్వక ఉత్తర్వులు రావాల్సి ఉందని ఐసీడీఎస్ సిబ్బంది చెప్పినా వినకుండా, గట్టిగా అరుస్తూ దుర్భాషలాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం కావడంతో అదే గదిలో ఐసీడీఎస్, రెవెన్యూ శాఖల సిబ్బంది తమ తమ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భవన వివాదాన్ని గత నెల రోజులుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నామని, తక్షణమే రాతపూర్వక ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని ఐసీడీఎస్ సిబ్బంది కోరుతున్నారు.
ఐసీడీఎస్ కార్యాలయంలో ఉద్రిక్తత


