బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం
తిరుపతి అర్బన్: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోమని బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ధన్వంత్‌కుమార్, అధ్యక్షుడు విజయభాస్కర్ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని రామానుజసర్కిల్ సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంక్‌లను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన దారుణమైనదన్నారు. బ్యాంక్ రుణాలను పెద్ద మొత్తంలో ఎగొట్టిన చలామణి అవుతున్న పెద్దలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగులు, కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. బ్యాంక్‌లను మరింత బలోపేతం చేయడానికి ఖాతాదారుల డిపాజిట్లపై వడ్డీని పెంచాలని సూచించారు. శాశ్వత ఉద్యోగులను ఓట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మార్పు చేయాలని దిశగా చర్యలు చేపట్టకూడదని అన్నారు. ఉద్యోగుల ఎన్‌పీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. వారానికి ఐదు రోజులు మాత్రమే పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీఈసీసీ సభ్యులు జనార్దన్, సుమలత, భాస్కర్, రేష్మ, నందగోపాల్, కేశవరెడ్డి, నిర్మల, మహేష్, వాగ్నేష్, భాస్కర్, పవన్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


