తీరప్రాంత గ్రామాల్లో టీడీపీకి షాక్
చిల్లకూరు : తీరప్రాంతంలోని చింతవరం, కొత్తపాళెం, మన్నెగుంట గ్రామాలకు చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడి మంగళవారం వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. మండలంలోని మోమిడి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డి చేతుల మీదుగా టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, పార్టీ మండల కన్వీనర్ ఎద్దల మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో టీడీపీ కార్యకర్తలను పార్టీలో చేర్చుకున్నామని చెప్పారు. ఏడాదిన్నర కాలంలో అధికార పార్టీ ద్వారా ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని, దీనికి తోడు అరాచకాలు, దాడులు పెరిగిపోతుండడంతో ప్రజలు విసుగుచెందారన్నారు. తీరప్రాంత గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు స్వలాభం కోసం కార్యకర్తలను విస్మరించడంతో విసుగుచెందిన వారు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ క్రమంలోనే చింతవరం, కొత్తపాళెం, మన్నెగుంట గ్రామాలకు చెందిన 40 మంది టీడీపీ కార్యకర్తలు సొంత పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. తీరప్రాంతంలో పార్టీని బలోపేతం చేసందుకు ఇప్పటి నుంచి ప్రతి గ్రామంలో పర్యటించి కార్యకర్తలకు భరోసా కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జోగి అంకారావు, మొగలిగుంట రవి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


