బతుకు బస్టాండు!
● అమరావతి సేవలో అర్టీసీ బస్సులు ● అరకొర సర్వీసులతో ఆపసోపాలుపడుతున్న ప్రయాణికులు ● సీటు మాట దెవుడెరుగు.. నిల్చునేదానికీ స్థలం లేక అవస్థలు
తిరుపతి అర్బన్: తిరుపతి సెంట్రల్ బస్టాండ్ ప్రయాణికులు, భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ సేవలు అమరావతికి మళ్లించడంతో సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేక పలువురు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. సాధారణంగా రోజుకు 1.6 లక్షల నుంచి 1.7 లక్షల మంది ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకుంటుంటారు. దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమల దర్శనానికి విచ్చేస్తుంటారు. విజయవాడలో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం నేపథ్యంలో గురువారం రాత్రి జిల్లాలోని 145 సర్వీసులను దారిమళ్లించారు. అయితే అధికారులు మాత్రం ఒక్కో నియోజవర్గం నుంచి పది బస్సుల చొప్పున ఏడు నియోజకవర్గాల నుంచి 70 సర్వీసులను పంపినట్లు చెబుతున్నారు. జిల్లాలో 774 సర్వీసులు నడుస్తుండగా.. అందులో 240 సర్వీసులు తిరుమల కొండకు తిప్పారు. మిగిలిన అన్ని మార్గాల్లో బస్సుల కొరత కొట్టొచ్చినట్టు కనిపించింది. తిరుపతి బస్టాండ్‌లో 64 ప్లాట్‌ఫాంలు ఉండగా.. అందులో 10 శాతం మినహా మిగిలిన అన్ని ప్లాట్‌ఫాంలూ బస్సులు లేక ఖాళీగానే దర్శనమిచ్చాయి. రాయచోటి, మదనపల్లి మార్గాల్లో 50 శాతం సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులు పడరానిపాట్లు పడాల్సి వచ్చింది.
ప్రయాణికులతో కిక్కిరిసిన తిరుపతి బస్టాండ్
బస్సు ఎప్పుడొస్తుందో?
తిరుపతి బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. తిరుమల దర్శనం వచ్చిన పిల్లలు, పెద్దలు, వృద్ధులు నానా అవస్థలు పడాల్సి పరిస్థితి ఏర్పడింది. శ్రీకాళహస్తి, వెంకటగిరి, సత్యేవేడు, గూడూరు తదితర అన్ని డిపోల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


