చిన్నపిల్లల ఆస్పత్రి భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి
తిరుపతి తుడా: అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి నూతన భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం నూతన భవనాన్ని ఆస్పత్రి వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఈఓ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ నూతన ఆస్పత్రి భవనం పూర్తి అయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులు, ఆపరేషన్ యంత్రాలు, ఫర్నీచర్, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న జీ ప్లస్ 6 నూతన ఆస్పత్రి భవనంలో వైద్యసేవలు, పరిపాలనా భవనాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పద్మావతి హృదయాలంలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో మాట్లాడారు. గుండె సంబంధ శస్త్రచికిత్సలు చేసుకున్న అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, తెనాలి, రాయచోటి, కర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులు, వారి సంరక్షకులతో ఉచిత వైద్యసేవలు అందుతున్నాయా?, ఉచితంగా మందులు అందిస్తున్నారా? లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు 4,950 మందికి గుండె శస్త్రచికిత్సలు, 23 గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈ టీవీ సత్యనారాయణ, ఎస్‌ఈ వేంకటేశ్వర్లు, మనోహరం, చిన్న పిల్లల గుండె చికిత్సల ఆస్పత్రి అధికారులు శ్రీనాథ్‌రెడ్డి, ఆర్‌ఎంఓ భరత్ తదితరులు పాల్గొన్నారు.


