ఆర్‌డీఎస్‌ఎస్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి రూరల్ : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పునర్‌వ్యవస్థీకరణ విద్యుత్ పంపిణీ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు. సంస్థ పరిధిలో ఆర్‌డీఎస్‌ఎస్ పనుల పురోగతిపై గురువారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ కన్‌స్ట్రక్షన్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా ఆర్‌డీ ఎస్‌ఎస్ పనులను చేపడుతున్నామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను, 11 కేవీ ఫీడర్లను వేరు చేయడం, ఓవర్ లోడ్ సమస్యను అధిగమించేందుకు వీలుగా అదనంగా 33 కేవీ ఫీడర్ల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాలకు నిరంతరాయంగా, నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన పనులను చేపడుతున్నామన్నారు. అలాగే వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం పూర్తి అయితే రైతులకు మరింత మెరుగ్గా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్ ఖాన్, కే. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ జె. రమణాదేవి, జనరల్ మేనేజర్లు రామచంద్రరావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


