శివయ్యా.. ఈ కష్టాలు ఏమిటయ్యా..!
శ్రీకాళహస్తి: వాయులింగేశ్వరాలయంలో దర్శనానికి వచ్చే భక్తుల కష్టాలకు అంతులేకుండా పోతోంది. ఆదివారం అమావాస్య కావడంతోపాటు రాహుకేతు పూజల కోసం భక్తులు పోటెత్తారు. రికార్డు స్థాయిలో 30 వేల మందికి పైగా దర్శించుకున్నట్టు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు సరైన ప్రణాళికలు అమలుచేయకపోవడంతో రాహుకేతు పూజలతోపాటు స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. రూ.500, రూ.750 రాహుకేతు పూజ టికెట్లు తీసుకునే భక్తులు పూజ, దర్శనం పూర్తయ్యే సరికి నాలుగైదు గంటలు పట్టింది. రూ.200 టికెట్లు తీసుకున్న వారి పరిస్థితి కూడా అంతే. దీంతో మధుమేహ బాధితులు, వృద్ధులు, పిల్లలు అసహనానికి లోనై ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భక్తులు తమ చెప్పులను భిక్షాల గోపురం, శివయ్య గోపురం వద్ద వదలండంతో దక్షిణ గోపురం నుంచి దర్శనం చేసుకు ని బయటకు వచ్చి అక్కడి వరకు ఎండలో కాళ్లు కాలు తూ నడవాల్సి వచ్చింది.
రికార్డు స్థాయిలో పూజలు
ఆదివారం రికార్డు స్థాయిలో 8,766 రాహు కేతు పూజలు జరిగాయి. అంతేకాకుండా రూ.200 శీఘ్ర దర్శనానికి 4,109 టికెట్లు, రూ.500 అంతరాలయ దర్శనం టికెట్లు 564 అమ్ముడుపోయినట్టు అధికారులు వెల్లడించారు.


