డ్యూటీకి డ్రైవర్లు, కండక్టర్లు డుమ్మా
కాణిపాకం బస్సుల నిలిపివేత
కొత్త సంవత్సరంలో అధికార పార్టీ నేతలను కలవాలంటూ ఎగ్గొట్టిన వైనం
డ్యూటీకి రాని ఉద్యోగిని ప్రశ్నిస్తే.. నాయకుల నుంచి ఫోన్లు
తిరుపతి అర్బన్: కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీకి డుమ్మా కొట్టారు. అధికారపార్టీనేతల సేవలో తరించారు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతి బస్టాండ్‌లో కొత్త సంవత్సరం వేళ రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణ సమయంలోనే తిరుపతికి రోజుకు 1.50లక్షల మందికి పైగానే రాకపోకలు సాగిస్తుంటారు. దీనికితోడు 30వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు తిరుగుపయనం నేపథ్యంలో రద్దీ మరింత పెరిగింది. జనవరి 1 సందర్భంగా గురువారం పలువురు కండక్టర్లు, డ్రైవర్లు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను కలవాలంటూ డ్యూటీలకు డుమ్మా కొట్టారు. దీంతో అధికారులు పలు బస్సులను నిలిపివేశారు. ప్రధానంగా కాణిపాకం మార్గంలో నడుస్తున్న 8 బస్సులను రద్దుచేశారు.
ఇంకా పలుమార్గాల్లోని బస్సులను నిలిపివేశారు. ఇప్పటికే బస్సుల కొరతతో ఇబ్బంది పడుతుండడంతో ఉన్న బస్సులూ సిబ్బంది సెలవులతో రద్దు కావడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. బస్టాండ్‌లో గంటల తరబడి నిరీక్షించారు. 10 నుంచి 15శాతం మంది ఉద్యోగులు డ్యూటీకి గైర్హాజరైనట్టు సమాచారం. కొందరు ఉద్యోగ సంఘం నేతలు పదేపదే అధికార పార్టీ నేతల అండదండలతో డ్యూటీలకు డుమ్మాలు కొడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు ప్రశి్నస్తే వెంటనే అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లు చేయిస్తున్నారంటూ ఆర్టీసీ అధికారులు బాహాటంగానే చెబుతున్నారు.
సిబ్బంది కొరత సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాధం, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ నిర్మల గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్టాండ్‌లోనే ఉండి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపడానికి పడరానిపాట్లు పడ్డారు. కొంతమందికి ఫోన్లు చేసి డ్యూటీకి రావాలని బతిమాలి మరీ పిలిపించినట్టు తెలిసింది. కొందరు ఉద్యోగులు రాజకీయ నేతలతో అధికారులకు ఫోన్లు చేయించినట్టు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది.
ఉదయం నుంచి చాలా బస్సు సర్విసులను నిలిపివేశారని, అడిగినా బస్టాండ్‌లో పట్టించుకునేవారే లేరని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేవలం కాణిపాకం మార్గంలో నడుస్తున్న 8 బస్సులను మాత్రమే నిలిపివేసినట్టు తిరుపతి డిపో మేనేజర్ సురేంద్రకుమార్ తెలిపారు. ఇదిలాఉంటే సెలవు ఇవ్వకపోయినా విధులు ఎగ్గొట్టిన సిబ్బందిపై విచారణ చేపట్టినట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ తెలిపారు.


