డిగ్రీ హాల్‌టికెట్లలో గందరగోళం
● విద్యార్థుల జీవితాలతో ఎస్వీయూ అధికారుల ఆటలు ● ఒకే రోజు, ఒకే సమయంలో రెండు పరీక్షలు ● పరీక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ
తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మంగళవారం నుంచి ఎస్వీయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ రెండవ, నాల్గొవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు ఆదివారం నుంచి విడుదల చేశారు. విద్యార్థులకు జారీ చేసిన హాల్‌టికెట్లలో ఒకే సమయానికి రెండు పరీక్షలు రాయాలంటూ ముద్రించడంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు అవాక్కయ్యాయి. మరికొంత మంది హాల్‌టికెట్లలో పరీక్షల తేదీలు సైతం ముందు వెనక్కి మారిపోవడం విస్మయానికి గురిచేసింది. దీంతో జరిగిన తప్పును వర్సిటీ అధికారులకు మొరపెట్టుకోగా వెంటనే అధికారులు పరీక్షలను వాయిదా వేస్తూ సోమవారం అన్ని కళాశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్వీయూ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదని విద్యార్థులు, అధ్యాపకులు చర్చించుకుంటున్నారు.
రెండు రోజులు వాయిదా
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి దామ్లానాయక్ తెలిపారు. మొదటి రెండు రోజుల్లో జరగాల్సిన సబ్జెక్టులను మాత్రమే వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక కారణాల రీత్యా వాయిదా వేశామని, మొదటి రెండు పరీక్షలను మే 12 ,14 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జరగాల్సిన వివిధ సబ్జెక్టులు యథాతథంగా ఆయా తేదీల్లోనే జరుగుతాయన్నారు.


