ఈదురుగాలులు.. గాల్లో విమానం చక్కర్లు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఈదురు గాలుల వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో రేణిగుంట విమానాశ్రయంలో దిగాల్సిన ఇండిగో విమానం ల్యాండింగ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆపై చైన్నె విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లింది. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ఆదివారం రాత్రి 8.40కి ఇండిగో విమానం చేరుకోవాలి. అయితే ఈదురు గాలులతో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాశ్రయం నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ రాలేదు. దీంతో విమానం రేణిగుంట–ఏర్పేడు పరిసర ప్రాంతాల్లోనే దాదాపు అరగంట పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఎంతసేపటికీ వాతావరణం సానుకూలంగా లేకపోవడంతో చైన్నె విమానాశ్రయానికి చేరుకుంది. ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. వాతావరణం అనుకూలించిన వెంటనే చైన్నె నుంచి రేణిగుంట విమానాశ్రయానికి విమానం చేరుకుంటుందని అధికారులు తెలిపారు.


