సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తులు పొటెత్తారు. వీకెండ్, వరుస సెలవులు ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో, అలిపిరి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రాకతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో, శిలాతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు నిలిచిపోయారు. మరోవైపు.. అలిపిరి టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో, శ్రీవారి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. బుధవారం అర్ధరాత్రి వరకు 73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 10 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


