నేడు తిరుపతి పుట్టిన రోజు వేడుకలు

- - Sakshi

నాడు సమతామూర్తి స్వహస్తాలతో పునాది

గరుడ ఆకారంలో గ్రామానికి శ్రీకారం

నాటి గోవిందరాజపట్నమే నేటి తిరుపతి

యాదవరాయల ద్వారా ఆలయ నిర్మాణం

సహజంగా ప్రముఖులు, రాజకీయ, వ్యాపార, సెలబ్రెటీలతో పాటు ఎక్కువ మంది పుట్టినరోజును వేడుకగా జరుపుకోవడం చూస్తుంటాం. కానీ భారతదేశంలో ఏనగరానికీ లేని పుట్టిన రోజు ఒక్క తిరుపతి నగరానికి మాత్రమే ఉండడం విశేషం. సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు తన స్వహస్తాలతో 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామ ఈశాన్యంలో (నాలుగుకాళ్ల మండపం) వద్ద పునాది వేసినట్లు చరిత్రలో నిరూపితమైంది. అద్వైత పురుషుడైన సమతామూర్తి పుణ్యఫలమే తిరుపతి నగరమైంది. ఈ మేరకు శనివారం 894వ పుట్టిన రోజు వేడుకలకు తిరుపతి నగరం అత్యంత సుందరంగా ముస్తాబైంది.

తిరుపతి తుడా: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి పుట్టినరోజు ఉందన్న విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మేధావులు, పండితులతో కలసి 2022లో ప్రకటించారు. చరిత్ర, పురాణ, ఇతిహాసాల ఆధారంగా అద్వైత పురుషుడైన రామానుజాచార్యులు చేతుల మీదుగా తిరుపతి నగరం పురుడు పోసుకుందని సామాజానికి చాటిచెప్పారు. ఈ క్రమంలో శనివారం తిరుపతి నగర 894వ పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

1130వ ఏటే పునాది
శ్రీరామానుజాచార్యులు కంచి నుంచి తిరుమలకు వచ్చే క్రమంలో తన 112వ ఏట నిర్మానుష్యంగా ఉన్న పార్థసారథిస్వామి ఆలయం (నేటి గోవిందరాజస్వామి ఆలయం) ప్రాంతాన్ని ఓ గ్రామంగా నిర్ణయిస్తూ పునాది వేశారు. 1130 ఫిబ్రవరి 24వ తేదీన గ్రామానికి పునాది వేశారని స్పష్టమవుతోంది. కపిలతీర్థం సమీపంలో కొత్తూరు గ్రామం ఉండేది. వివిధ వ్యాధులతో ఆ గ్రామ వాసులు వరుసగా మృత్యువాత పడుతుండడాన్ని శ్రీరామానుజాచార్యులు గుర్తించారు. గోవిందరాజస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంలోనే కొత్తూరు గ్రామ ప్రజలను సంరక్షించడం, నిర్మానుష్య ప్రాంతంగా ఉన్న ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు గరుడ ఆకారంలో కొత్తగా నిర్మిస్తున్న గ్రామానికి హద్దులు పెట్టించి పునాది వేయించారు. ఆగమశాస్త్రోక్తంగా నాడు వేసిన పునాదే నేడు ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆ క్రమంలోనే ఆ గ్రామానికి గోవిందరాజపట్నంగా నామకరణం చేశారు. ఆ తరువాత గోవిందరాజపట్నానికి రామానుజపురంగా స్థానికులు పేరును మార్పుచేశారు. కాలక్రమేణా 13వ శతాబ్దంలో తిరుపతిగా ప్రసిద్ధికెక్కింది.

హద్దులు ఇవే
నాటి గోవిందరాజపట్నానికి కృష్ణాపురం ఠానా, నాలుగుకాళ్ల మండపం, రైల్వేస్టేషన్‌కు తూర్పు ప్రాంతం, బేరివీధి నాలుగు ప్రాంతాల్లో మండపాలను నిర్మించారు. ఆ తరువాత ఆయా ప్రాంతాల్లో శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నాలుగుకాళ్లమండపం మాత్రమే చరిత్రకు సాక్షిగా మిగిలింది.

తొలివీధి అదే
నాడు తిల్లా గోవిందరాజస్వామిని ప్రతిష్టించే లఘ్నం ఖరారు కావడంతో యుద్ధప్రాతిపాదికన సున్నపు ముద్దలతో గోవిందరాజస్వామి విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఆ విగ్రహంలో స్వామి వారి పొట్టలో దేవదాసి తిల్లా వద్ద ఉన్న లోహవిగ్రహాన్ని ప్రతిష్టించి తయారు చేశారని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. గోవిందరాజపట్నం గ్రామం ఏర్పడ్డాక రామానుజ తిరువీధి (గోవిందరాజస్వామి తూర్పుమాడావీధి) ఏర్పడింది. ఇలా తొలివీధి రామానుజ తిరువీధిగా చరిత్రలో నిలిచింది.

కై కాల రెడ్లదే తొలిదర్శనం
గోవిందరాజస్వామిని తొలినాళ్లలో దేవదాసి అయిన తిల్లా పూజిస్తూ స్వామివారి బాగోగులు చూసుకునేవారు. ఈ క్రమంలో దేవదాసి అయిన మహిళ పూజలు చేయడం ఏంటని ప్రశ్నించి అవమానించేవారు. ఈ క్రమంలోనే ఆమె కై కాల చెంగారెడ్డి అనే చిన్నారిని దత్తత తీసుకుంది. కై కాల చెంగారెడ్డి ద్వారా ఆలయంలో ఉత్సవాలు, సేవలను నిర్వహించేవారు. ఇందులో భాగంగానే నేటికీ కైకాల కులస్థులకు గోవిందరాజస్వామి ఆలయంలో తొలిదర్శనం కల్పిస్తున్నారు. శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఉత్సవాల్లోనూ ఈ వర్గానిదే ఆధిపత్యం.

నాటి రాజావీధే నేటి గాంధీరోడ్డు
గోవిందరాజపట్నం ఏర్పడ్డాక గ్రామానికి తొలివీధిగా రామానుజ తిరువీధితో పాటు పడమర, తూర్పు, దక్షిణ మాడావీధులు శ్రీవారి అర్చకులు, వారి బంధుమిత్రులకు ఆవాసాలుగా అభివృద్ధి చెందాయి. ఆ తరువాత ఆ వీధికి బజారువీధిగా ఆపై మహాత్మాగాంధీ ఈ రోడ్డులో నడయాడంతో గాంధీరోడ్డుగా మార్పుచెందింది. సున్నం తయారు చేస్తున్న ప్రాంతం సున్నపువీధిగా, ఇసుక నిల్వ ఉంచిన ప్రాంతాన్ని ఇసుక వీధిగా నామకరణం చేశారు. బండ్లు నిలిపే ప్రాంతమే నేటి బండ్ల వీధిగా మారినట్టు తెలుస్తోంది.

తొలి భక్తుడు ఆయనే
శ్రీమన్నారాయనుడు శ్రీవేంకటేశ్వరుడిగా సప్తగిరులపై కొలువుదీరారు. శ్రీరామానుజాచార్యుల మేనమామ అయిన శ్రీవారి పరమ భక్తుడు తిరుమల నంబి తొలిభక్తుడుగా కీర్తిగడించారు. ఆయన అనుగ్రహంతోనే అడపురి(అలిపిరి) ఓ మహావృక్షం కింద శ్రీరామానుజాచార్యులు వారు ఆధ్వైత పురుషుడుగా, వైఖానస పండితులుగా ప్రసిద్ధి గడించారు. 904 ఏళ్ల క్రితం తిరుమల ఆలయ పరిరక్షణ కోసం జీయంగార్ల వ్యవస్థను తీసుకొచ్చారు.

ఇదో చారిత్రక ఘట్టం
ఏ నగరానికీ లేని పుట్టిన రోజు తిరుపతి నగరానికి మాత్రమే ఉంది. ఇది నగర ప్రజలకు దక్కిన గౌవరం. పుణ్య పురుషుడైన శ్రీ రామానుజాచార్యుల వారి చేత ఆ శ్రీమన్నారాయణుడే తిరుపతి పుణ్యక్షేత్రానికి పుణాది వేయించారు. ఈ చరిత్ర తెలియడం చారిత్రక ఘట్టమే. అందుకే తిరుపతి పుట్టిన రోజు వేడుకలను ప్రతి ఏటా జరుపుకోవడం మనందరి బాధ్యత.
– భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ చైర్మన్‌.

ఇప్పటికీ గోవిందరాజపట్నంగానే..
తమిళులు ఇప్పటికీ తిరుపతిని గోవిందరాజపట్నంగానే పిలుస్తుంటారు. కపిలతీర్థం సమీపంలోని కొత్తూరు గ్రామ ప్రజలను రక్షించడం, గోవిందరాజస్వామి ఆలయాన్ని నిర్మించడం, ఈ ప్రాంతం దేదీప్యమానంగా విరాజిల్లాలన్న సంకల్పంతో గరుడ ఆకారంలో గోవిందరాజ పట్ననికి హద్దులు నిర్ణయించారు.
– ఆచార్య పేట శ్రీనివాసులరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ ఫౌండర్‌, డైరెక్టర్‌

whatsapp channel

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top