యువగళం..అత్యుత్సాహం! | - | Sakshi
Sakshi News home page

యువగళం..అత్యుత్సాహం!

Published Mon, Jun 26 2023 10:40 AM | Last Updated on Mon, Jun 26 2023 11:39 AM

గాంధీపార్కు సమీపంలో చించివేసిన వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీ  - Sakshi

నాయుడుపేట: యువగళం పాదయాత్రలో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ అధినేత నారా లోకేష్‌ దృష్టిలో పడేందుకు నానాయాగీ చేశారు. జనాలు కరువైనా పాదయాత్ర విజయవంతం చేసేందుకు నానాతంటాలు పడ్డారు. ఇందులో భాగంగా నాయుడపేటలో కొందరు తమ్ముళ్లు అరాచకం సృష్టించారు. గతంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ బ్యానర్లను ఇష్టారాజ్యంగా చించివేశారు. మరికొన్ని తొలగించి ఎత్తుకెళ్లారు. దీనిపై స్థానిక నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే
నాయుడుపేట గడియారం సెంటర్‌ వద్ద పెత్తందారులు.. పేదల మధ్య యుద్ధం అనే బ్యానర్‌ను గతంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఏర్పాటు చేశారు. నారా లోకేష్‌ స్థానికంగా బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో టీడీపీ నేతలు ఆ బ్యానర్‌ను చించివేశారు. ఆపై పక్కనే ఏర్పాటు చేసిన బ్యానర్లనూ నాశనం చేశారు. ఇదే అదునుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య బ్యానర్లను చించివేయడమేకాకుండా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. తమ అధినేత దృష్టిని ఆకర్షించాలని పూనకంతో ఊగిపోయారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ శ్రీకాంత్‌ వారిని వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.

యువగళం..నిరుత్సాహం
యువగళం పాదయాత్రకు జనాల్ని తరలించేందుకు ఆ పార్టీ నేతలు నానా తంటాలు పడ్డారు. సభకు ఎవరూ రాకపోవడంతో గ్రామాల నుంచి ఆటోల్లో తరలించాల్సి వచ్చింది. ఒక్కొక్కరికీ రూ.200 చొప్పున ఇచ్చి తరలించిన నేతలు.. అందులో కొందరికి డబ్బులివ్వకపోవడంతో మండిపడ్డారు. సంబంధిత చోటామోటా నేతలపై తిట్లదండకం అందుకోవడం కనిపించింది. దీనికితోడు జనాలను తరలించేందుకు పార్టీ ఫండ్‌గా ఒక్కో పంచాయతీకి రూ.4వేలే ఇవ్వడం.. దాన్ని స్థానిక నేతలు తిరస్కరించడం చర్చనీయాంశమైంది. యువగళం సభలో లోకేష్‌ మాట్లాడుతున్నా జనం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో చివరిలో డీజే పాటలతో చేతులు ఊపించే ప్రయత్నం చేశారు.

రాజ్యాంగ నిర్మాతను మరిచిన లోకేష్‌
పట్టణంలోని గాంధీమందిరం వద్ద నారా లోకేష్‌ బహిరంగ సభ జరిగింది. ఆపై పది అడుగుల దూరం నడిచిన ఆయన ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని చూసి పటీపట్టనట్టు వెళ్లిపోయారు. అక్కడే ఉన్న కొందరు ఎస్సీ నాయకులు పూలమాల తెచ్చి అంబేడ్కర్‌ విగ్రహానికి వేయాలని సూచించినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. టీడీపీలో ఎస్సీలకు సముచిత స్థానం లేదనడానికి ఇదే నిదర్శనమని కొందరు నేతలు చెవులు కొరుక్కోవడం కనిపించింది.

లోకేష్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు
అంబేడ్కర్‌ను గౌరవించలేని నారా లోకేష్‌కు ఆయన రాసిన రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హతే లేదని దళిత విద్యావేత్త, దళిత సంఘాల నాయకులు పేర్నాటి సాగర్‌ తీవ్రంగా విమర్శించారు. దళితోద్ధారకుడినని చెప్పిన లోకేష్‌కు అంబేడ్కర్‌ కనిపించలేదా? అని ప్రశ్నించారు. రాజకీయాలకు మాత్రం రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను వాడుకుంటారా..అని నిలదీశారు. దళితులపై అంకితభావం లేని టీడీపీ నేతలు, దళితోద్ధారకులు ముసుగులు తీయాలని సూచించారు. దళితులు రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం నేర్పుతారన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీల చించివేత
నాయుడుపేటటౌన్‌:పట్టణంలోని గాంధీపార్కు సమీపంలో, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ ఫ్లెక్సీలను శనివారం అర్ధరాత్రి టీడీపీ నేతలు కొందరు చించి వేశారు. టీడీపీ నేత నారా లోకేష్‌ జరుపుతున్న యువగళం పాదయాత్రకు ఆ పార్టీ నాయకులు గాంధీపార్కు సెంటర్‌ తదితర చోట్ల టీడీపీ నేతల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. గాంధీపార్కు కూడలి సమీపంలో లోకేష్‌ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడి నట్లు తెలిసింది. ఫ్లెక్సీల చించివేతపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నాయుడుపేటలో చించివేసిన ఫ్లెక్సీ
1/1

నాయుడుపేటలో చించివేసిన ఫ్లెక్సీ

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement