జనగామ జిల్లా: హాస్టల్ భవనంపై నుంచి దూకి యువతి (ప్రైవేట్ ఉద్యోగి) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. ఎస్సై చెన్నకేశవులు, స్థానికుల వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామానికి చెందిన వి.మౌనిక జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ షోరూంలో పని చేస్తోంది. రాత్రి హాస్టల్‌కు వచ్చిన ఆమె తెల్లవారుజామున హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. రెండు కాళ్లు విరిగి, తీవ్రగాయాల పాలైన మౌనికను సహచరులు, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
డాడీ ఇది నా చివరి కోరిక..
ఘటనా స్థలంలో మౌనిక వద్ద ఉన్న సూసైడ్ నోట్‌ను ఎస్సై చెన్నకేశవులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మౌనిక.. ‘డాడీ నా గురించి తప్పుగా అనుకోకు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎవరినీ ఏమనొద్దు. నా మరణం వల్ల ఎవరూ ఇబ్బంది పడవద్దు.. ఇదే నా చివరి కోరిక’అంటూ అందులో పేర్కొంది. అమ్మ, డాడీ, గణేశ్ గుడ్ బాయ్, టేక్ కేర్ ఆల్, ఐ లవ్ యూ నాన్న అని రాసి హాస్టల్ భవనంపై నుంచి దూకగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఘటనపై ప్రాథమిక వివరాలు తీసుకున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు వచి్చన వెంటనే దర్యాప్తు చేస్తామని ఎస్సై చెన్నకేశవులు తెలిపారు.


