హైదరాబాద్: మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. మహిళలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగానే కాకుండా నాయకత్వ స్థానాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
‘హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’.. మేనేజ్‌మెంట్ గురించి నగరంలోని అన్ని రంగాల వ్యక్తులకు, విద్యార్థులకు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి సామర్థ్యాన్ని పెంచేందుకు రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోంది. 2025-26 సంవత్సరానికి ‘మేనేజ్‌మెంట్ ఇన్ ఏఐ ఎరా’ అనే థీమ్‌తో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) అనుసంధానంతో నారీ శక్తి గురించి ‘ఎమర్జ్’ పేరిట హైదరాబాద్ బేగంపేట్‌లోని హోటల్ టూరిజం ప్లాజాలో శనివారం భారీ సదస్సు నిర్వహించారు. ‘వుమెన్ డెవలప్‌మెంట్ నుంచి వుమెన్- లీడ్ డెవలప్‌మెంట్’ అనే థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్యా మిశ్రా మాట్లాడుతూ.. ‘వుమెన్ డెవలప్‌మెంట్’ అంటే మహిళల భాగస్వామ్యం మాత్రమే కాదు.. మహిళలు కార్యక్రమాల్లో పాల్గొనేవారుగానే కాకుండా, లీడర్‌షిప్ పొజీషన్లలోకి వచ్చి కార్పొరేట్ వ్యవస్థలో గానీ, వ్యాపార రంగంలో గానీ ముందుకు రావాలని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.
అసోసియేషన్ అధ్యక్షుడు ఆల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో పెరుగుతుండగా, కొత్త తరం మరింత ఉత్సాహంతో ముందుకు వస్తోంది. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, స్టార్టప్‌లలో మహిళలు విశేషంగా రాణిస్తున్నారు. దేశంలో ఈ దిశగా తెలంగాణ ముందంజలో ఉంది. ఇలాంటి సదస్సులు మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయి ’ అని పేర్కొన్నారు.
గత తరంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గత తరం చూస్తే మహిళలు నాయకత్వం లేదా కార్పొరేట్ రంగంలో కొద్దిమంది మాత్రమే ఉండేవారు. కానీ ఇప్పుడు వారి తదుపరి తరం కూడా ముందుకు వస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలు కేవలం పాల్గొనడం మాత్రమే కాకుండా ఉన్నత విద్యలో రాణించడం, పోటీ పరీక్షలు ఎదుర్కోవడం, అన్ని రంగాల్లో ముందుకు సాగడం జరుగుతోంది. ముఖ్యంగా స్టార్టప్‌లలో కూడా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ‘కుర్చీయే కాదు.. కుర్చీని షేక్ చేసేలా మహిళలు ముందుకొస్తున్నారు.. దేశంలో ఈ విషయంలో తెలంగాణ ముందంజలో ఉంది. ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి సదస్సులు మహిళలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి’ అని చెప్పారు.
అనంతరం కామినేని ఆస్పత్రుల సీవోవో గాయత్రి కామినేని మాట్లాడుతూ.. నాయకత్వం అంటే కేవలం పదవిలో ఉండటం కాదని, మార్పును తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఫ్యూచరిస్టిక్ సిటీ డైరెక్టర్ కరుణ గోపాల్ మాట్లాడుతూ.. ఎంట్రప్రెన్యూర్‌షిప్ వైపు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ వ్యవస్థలోనూ వ్యాపార రంగంలోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను గుర్తించి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.


