
కలెక్టరేట్ ఈ– సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నిందితురాలు
రైతు నుంచి రూ.15వేలు లంచం
తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
వికారాబాద్: లంచం తీసుకుంటూ ఓ మహిళా ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కింది. కలెక్టరేట్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన ఓ రైతు తన రెండెకరాల అసైన్డ్ భూమికి సంబంధించి రికార్డుల్లో తన తల్లి పేరు నమోదు చేయించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన ఫైల్‌ను ఈ– సెక్షన్ నుంచి కలెక్టర్ పేషీకి పంపించాల్సి ఉంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాత ఇందుకోసం రూ.5 వేలు డిమాండ్ చేసింది.
ఈ మొత్తాన్ని పదిహేను రోజుల క్రితమే రైతు నుంచి గూగుల్ పే చేయించుకుంది. అనంతరం కలెక్టర్ ప్రొసీడింగ్ ఇవ్వగా.. తిరిగి ఆ కాపీని తహసీల్దార్ ఆఫీసుకు పంపించాల్సిఉంది. రోజులు గడుస్తున్నా ఫైల్ రాకపోవడంతో బాధితుడు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ సుజాతను కలిశాడు. దీనిపై స్పందించిన ఆమె ప్రొసీడింగ్ కాపీ తహశీల్దార్ కార్యాలయానికి పంపాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. రూ.15,000 బేరం కుదిరిన అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారి సూచన మేరకు సుజాతకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. ఈ– సెక్షన్‌లో సోదాలు నిర్వహించి, పలు ఫైళ్లను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తీసుకుని, ఈ వ్యవహారంలో మరెవరి పాత్రయినా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిందితురాలిని ఏసీబీ కోర్డులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలిస్తామని వెల్లడించారు.
లంచం అడిగితే 1064 కాల్ చేయండి..
అధికారులు, ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని, ఇందుకోసం 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు.