హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను దారుణంగా హత్య చేసింది ఓ భార్య. ఆపై ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయింది. ఎల్‌బీనగర్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుల వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తట్టుపల్లికి చెందిన బోడ నర్సింగ్ (33)కు స్వరూపతో 2008లో వివాహమైంది. ఇటీవల నర్సింగ్ ఎల్‌బీనగర్ ఎనీ్టఆర్ నగర్‌లో అద్దె ఇల్లు తీసుకుని కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.
స్వరూపకు సొంత గ్రామానికి చెందిన మోహన్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఇది నర్సింగ్‌కు తెలియడంతో తీవ్రంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్ద మనుషులు పంచాయితీ కూడా అయింది. 3 రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నర్సింగ్‌ను అంతమొందించాలని స్వరూప పథకం వేసింది. శనివారం కూడా గొడవ జరిగింది. అయితే, తర్వాత భర్తతో ఏకాంతంగా ఉన్న సమయంలో అతడి ఛాతీపై కూర్చొని చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది. మృతదేహాన్ని మంచానికి చున్నీతో కట్టి ఆత్మహత్యగా నమ్మించబోయింది. డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. ఈలోగా గోనర్సింగ్ మృతిపై అనుమానంతో అతడి అన్న బిచ్యానాయక్ ఎల్‌బీనగర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతుగా ఆరా తీయడంతో పాటు.. శవ పరీక్ష నివేదికతో నర్సింగ్‌ది ఆత్మహత్య కాదని తేలింది. కాగా, స్వరూప భర్తను చంపాక ప్రియుడికి ఫోన్ చేసి పారిపోవాలని చూసింది. పోలీస్‌లు ప్రత్యేక బృందంతో అల్కాపురి వద్ద ఆమెను అరెస్టు చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించింది. సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సింగ్ దంపతుల పెద్ద కూతురు వరంగల్ గురుకులంలో పదో తరగతి పూర్తి చేసింది. చిన్న కూతురు హయత్‌నగర్‌లో 8వ తరగతి చదువుతోంది.


