మా చావుకు కారణం.. ఈ మెసేజ్‌ చదివితే తెలుస్తుంది! | Wife and Husband Incident Latest Updates | Sakshi
Sakshi News home page

మా చావుకు కారణం.. ఈ మెసేజ్‌ చదివితే తెలుస్తుంది!

Jun 30 2026 7:43 AM | Updated on Jun 30 2026 3:09 PM

Wife and Husband Incident Latest Updates

రంగారెడ్డి: దంపతులు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో మిస్టరీ వీడింది. మోకిల పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి. ఎస్‌ఐ సురేశ్‌ కథనం ప్రకారం.. జన్వాడకి చెందిన వడ్ల బాలసాయి (32) సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్‌ గ్రామానికి చెందిన పద్మ(26) కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోగా.. వారికి ఐదునెలల బాబు ఉన్నాడు. 

బాలసాయి ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగునెలల క్రితం జుల్కల్‌లో నివసించే అత్తామామలు శాంతమ్మ, చంద్రయ్య ఇంటికి గుర్తు తెలియని సాధువు వచ్చాడు. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, తవ్వితే ధనవంతులు అవుతారని ఆశ పెట్టాడు. దీనికి ధనం కావాలని చెప్పడంతో వారు పెద్దల్లుడు వెంకటేశ్‌తో కలిసి బాలసాయిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పలు దఫాలుగా రూ.10 లక్షలు వారికి ఇచ్చాడు.

 తీరా అడిగే సరికి ఇష్టం వచ్చినట్లు దూషించడంతో భార్యాభర్తలు మనస్తాపానికి గురయ్యారు. చేసిన అప్పులు తీర్చే అవకాశం లేకపోవడంతో బలవన్మరణానికి సిద్ధపడ్డారు. ఆదివారం కుటుంబసభ్యులకు తెలిసేలా భార్య ఫోన్‌కి మెసేజ్‌ పెట్టి, ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మెసేజ్‌ ఆధారంగా పోలీసులు శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేశ్‌ని అదుపులోకి విచారించగా నేరం అంగీకరించారు. వారిని సోమవారం చేవెళ్ల కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌ నిమిత్తం సంగారెడ్డి జిల్లా జైలుకి తరలించారు. 

అమ్మ, తమ్ముళ్లకు సారీ.. బాబుని బాగా చూసుకోండి 
చనిపోయే ముందు బాలసాయి చేసిన మెసేజ్‌లో పెళ్లి జరిగిన తర్వాత అత్తమామతో పడిన బాధలను క్లుప్తంగా వివరించాడు. ‘అమ్మ, తమ్ముళ్లు సారీ.. నాతో కావడం లేదు. నేను నా భార్య చనిపోతున్నాం.. మీరు బాబుని బాగా చూసుకోండి.. పెళ్లి తర్వాత అందరం మంచిగా ఉందామని అత్త, మామ ఇంటికి పిలిచారు.. భార్య ప్రెగ్నెంట్‌ అయినప్పటి నుంచి నరకం చూపించారు.. ధనవంతులు అవుతాం, అప్పు కావాలని అడిగితే మొత్తంగా రూ. 10 లక్షలు ఇచ్చా.. అడిగితే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు.. ఫొటోగ్రాఫర్‌గా ఈవెంట్స్‌ చేసిన డబ్బులు, కెమెరా తాకట్టు పెట్టి మరీ ఇచ్చా.. మా చావుకి కారణం అత్తామామలు శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేశ్‌లే’ అని మెసేజ్‌ చేశాడు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement