
విషయం తెలిసి సదరు మహిళ భర్త బలవన్మరణం
ఘటనలో ఉపాధ్యాయుడి అరెస్ట్
భద్రాద్రికొత్తగూడెం జిల్లా: మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె భర్త మృతికి కారణమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కటకటాల పాలయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం సూర్యాతండాకు చెందిన వాంకుడోత్ బావుసింగ్ ములుగు జిల్లా వాజేడు మండలం బిజినేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో జూలురుపాడుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో అతను సూసైడ్ నోట్ రాసి సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన కొత్తగూడెం పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని ఈనెల 11వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎంఈఓ వెంకటేశ్వర్లును వివరణ కోరగా బావుసింగ్‌ను అరెస్ట్ చేసిన మాట వాస్తమే కాని తనకు, జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టా సమీపంలోని మొరుమూరు పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడిని బిజినేపల్లి పాఠశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు.