హాజరు పెరుగుతోంది..
నిత్యం పర్యవేక్షణ
జూనియర్ కాలేజీల్లో
ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు
అధ్యాపకులతో పాటు
విద్యార్థులకూ నమోదు
గతంతో పోలిస్తే 20 శాతం పెరిగిన హాజరు
విద్యార్థులకు ఉపయోగం
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒక్కో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి, విద్యార్థులకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేస్తోంది. ఈ క్రమాన కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం గతం కంటే 20 శాతం వరకు పెరగడం విశేషం.
5,912మంది విద్యార్థులు..
జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. వీటిలో 5,912 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సగటున 3,405 మంది విద్యార్థులు నిత్యం కళాశాలలకు హాజరవుతున్నారు. అదేవిధంగా అధ్యాపకుల హాజరు సైతం పెరుగుతోంది. గతంలో 50 నుంచి 55శాతం హాజరు ఉండగా, ఎఫ్‌ఆర్‌ఎస్ అమలయ్యాక అది 65శాతానికి పెరిగింది. గత సెప్టెంబర్ నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ ప్రారంభం కాగా, ఎక్కువ మంది విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలలకు వస్తున్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేయడంతో హాజరు శాతాన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు ఉన్నతాధికారులు సైతం నిత్యం పర్యవేక్షిస్తున్నారు. దీంతో హాజరు కాని విద్యార్థులపై దృష్టి సారిస్తూ తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నారు. ప్రతి విద్యార్థి కళాశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు సైతం సహకరిస్తుండడంతో హాజరుశాతం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడంతో పాటు వారు కూడా చదువుపై దృష్టి సారించడంతో ఫలితాలు మెరుగయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు తర్వాత హాజరు శాతం పెరుగుతోంది. విద్యార్థులు సకాలంలో సక్రమంగా హాజరవుతున్నందున చదువుపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుతో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుండగా.. అధ్యాపకులు సైతం కళాశాలలకు సకాలంలో హాజరవుతున్నారు. సుమారు 10 నుంచి 20 శాతం వరకు హాజరు పెరిగింది. – రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం
హాజరు పెరుగుతోంది..


