● ‘నకిలీ’లతో నష్టపోయాం.. న్యాయం చేయండి
తాము సాగు చేసిన మొక్కజొన్న పంట నష్టపోయామని, న్యాయం చేయాలని ఏన్కూరు మండలం రేపల్లెవాడకు చెందిన రైతులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వేడుకున్నారు. గ్రామానికి చెందిన 14 మంది రైతులు 50 ఎకరాల్లో సింజెంట్ కంపెనీకి చెందిన 602 రకం విత్తనాలతో మొక్కజొన్న సాగు చేశారు. 40 రోజుల తర్వాత చేనులో గడ్డి నివారణ కోసం ఆ కంపెనీ ఏజెంట్ సలహా మేరకు టింజర్, అట్రాజన్ మందులను పిచికారీ చేశారు. ఆ తర్వాత ఐదారు రోజుల్లోనే పంట ఎండిపోయి నిర్జీవంగా మారింది. దీనిపై ఏన్కూరు మండల వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశామని, అయినా ఆయన పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. నకిలీ విత్తనాలు, మందులతో తాము మోసపోయామని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్


