చరిత్రలో నిలిచిపోయేలా సభ
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఈనెల 18న ఖమ్మంలో జరగనుండగా, చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ జాతీయ సమితి సభ్యుడు, ఉత్సవాల ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగే సభకు అన్ని రాష్ట్రాల నుంచి సీపీఐ నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా పాల్గొంటారని వెల్లడించారు. సభ జయప్రదం కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నామని, 9న ఖమ్మంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ, 10 నుంచి 14 వరకు కళారూపాల ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. అంతేకాక ఈనెల 12న డీపీఆర్‌సీ భవనంలో జరిగే కవి సమ్మేళనానికి ప్రముఖ కవులు సుద్దాల అశోక్‌తేజ, కేవీఎల్ తదితరులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇప్పటికే సేకరించిన వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించి రచనలతో ప్రత్యేక సంకలనాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు. అలాగే, ఈనెల 17న జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం, 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఇక 20వ తేదీన ‘దేశంలో వామపక్ష ఉద్యమం – ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై జరిగే జాతీయ స్థాయి సెమినార్‌లో అన్ని వామపక్షాల జాతీయ నాయకులు పాల్గొంటారని బాగం వివరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు ఏపూరి లతాదేవి, జమ్ముల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ శత వార్షిక సభ ఆహ్వాన సంఘం కార్యదర్శి బాగం


