కబడ్డీ.. కబడ్డీ..
జాతీయస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
పలు రాష్ట్రాల నుంచి
హాజరైన క్రీడాకారులు
పోటీలను ప్రారంభించిన
మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క
పినపాక: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో బుధవారం ప్రారంభమయ్యాయి. దేశంలోని 28 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి జట్లు హాజరుకాగా, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబడ్డీ భారతదేశంలోనే పుట్టిన సంప్రదాయ క్రీడ అన్నారు. ప్రతీఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశ చెందకుండా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి మారుమూల గిరిజన ప్రాంతమైన ఈ బయ్యారంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఇందుకు బాధ్యత తీసుకున్న మౌరీ టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను వారు అభినందించారు. క్రీడా పోటీల కోసం సుమారు ఆరు నెలలు శ్రమించి ఏర్పాట్ల నుంచి ఆతిథ్యం వరకు సమర్థవంతంగా నిర్వహించడం ప్రశంసనీయమని చెప్పారు. తమ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను ఏర్పాటు చేస్తామని వెల్ల డించారు. కార్యక్రమంలో పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, డీఈఓ నాగలక్ష్మి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ పరిశీలకులు నిర్మల్ జాందే, కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వభారత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు 14 మ్యాచ్‌లు..
జాతీయస్థాయి పోటీల్లో మొత్తం 32 జట్లు పాల్గొనగా, లీగ్ దశలో ఎనిమిది గ్రూపులుగా విభజించారు. తొలి రోజు 14 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మధ్యప్రదేశ్–చండీఘర్ జట్లు పోటీ పడగా మధ్యప్రదేశ్ జట్టు, ఆంధ్రప్రదేశ్–జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన పోటీలో ఏపీ జట్టు, పాండిచ్చేరి–పశ్చిమబెంగాల్ జట్లు పోటీ పడగా పాండిచ్చేరి, తమిళనాడు–బిహార్ జట్లు తలపడగా తమిళనాడు, కర్ణాటక–గుజరాత్ జట్ల మధ్య జరిగిన పోటీలో కర్ణాటక, మహారాష్ట్ర–కేరళ జట్లు పోటీపడగా మహారాష్ట్ర, రాజస్థాన్–ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో రాజస్థాన్, హరియాణా–అసోం జట్లు పోటీ పడగా హరి యాణా, ఒడిశా–పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోటీలో పంజాబ్, త్రిపుర–మణిపూర్ జట్లు తలపడగా మణిపూర్ జట్టు గెలుపొందాయి. వీటితో పాటు సీఐఎస్సీఈ–సీబీఎస్‌ఈ జట్లు పోటీ పడగా సీబీఎస్‌ఈ, ఢిల్లీ–జమ్మూ కశ్మీర్ జట్లు పోటీ పడగా ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్– సీబీఎస్‌ఈ వెల్ఫేర్ జట్లు పోటీ పడగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్–ఛత్తీస్‌గఢ్ జట్లు తలపడగా ఛత్తీస్‌గఢ్ విజయం సాధించాయి.
కబడ్డీ.. కబడ్డీ..


